మంగళం
మన ఆటలకు
ఇంటర్ వాళ్లకు మరో రూల్!
త్రోబాల్ పోటీలు
ఆడుతున్న క్రీడాకారులు
అగనంపూడి: గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నీకాయిట్, క్యారమ్స్, బాల్‌బ్యాడ్మింటన్, క్రికెట్, వంటి క్రీడలు ఆడేందుకు ఎంతో మక్కువ చూపిస్తారు. అయితే వీటిలో చాలా క్రీడలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ)లో మంగళం పాడేసింది. మన రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించే త్రోబాల్, టెన్నీకాయిట్, బాల్‌బ్యాడ్మింటన్, క్యారమ్స్ వంటి క్రీడలను ఎస్‌జీఎఫ్‌ఐ జాబితా నుంచి తొలగించింది. గత విద్యా సంవత్సరంలో బాల్‌బ్యాడ్మింటన్‌ను పక్కనపెట్టగా, ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన మూడు క్రీడలకు మంగళం పాడారు. దీంతో ఈ ఏడాది జరిగిన రాష్ట్రస్థాయి(ఎస్‌జీఎఫ్‌ఏపీ) పోటీల్లోనూ ఈ ఆటలకు చోటు లేకుండా పోయింది.
మనకు తెలియని ఆటలకు పెద్దపీట
మన రాష్ట్ర విద్యార్థులకు పట్టున్న క్రీడలను పక్కనపెట్టిన ఎస్‌జీఎఫ్‌ఐ.. మనకు ఏమాత్రం సంబంధం లేని, కనీస అవగాహన కూడా లేని థంగ్–టా, సపక్ తర్కా, గటకా, కేలరీపాయట్టు, కుర్షు, మల్లఖాంబ్, మోడరన్ పాంథ్లూన్, స్క్వాష్, వాటర్‌పోలో, వుషూ వంటి క్రీ డలను చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 69వ స్కూల్ గేమ్స్‌లో వీటిని నిర్వహించినా, మన పిల్లల కు ఎంతో ఇష్టమైన ఆటలను మాత్రం విస్మరించారు. మన రాష్ట్ర అధికారులు జాతీ య స్థాయిలో గట్టిగా నిలదీయకపోవడం వల్లే విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్‌ఎం సర్టిఫికెట్ చెల్లదట
క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థుల వయసు ధ్రువీకరణ విషయంలో ఎస్‌జీఎఫ్‌ఐ కొత్త నిబంధనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. గెజిటెడ్ అధికారి అయిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూల్ రికార్డుల ప్రకారం జారీ చేసే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రానికి విలువ లేకుండా పోయింది. కేవలం ఆధార్ కార్డులోని తేదీనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. వాస్తవానికి ఆధార్ అనేది చిరునామా గుర్తింపు కోసమేనని ప్రభుత్వాలు చెబుతున్నా, క్రీడా సమాఖ్యలు మాత్రం వయసు నిర్ధారణకు దానినే కొలమానంగా తీసుకోవడం విడ్డూరం. ఈ నిబంధన వల్ల చాలా మంది అర్హులైన క్రీడాకారులు అనర్హులుగా మిగిలిపోతున్నారు.
చిన్నచూపు తగదు
ఎస్‌జీఎఫ్‌ఐ ప్రకటించిన షెడ్యూల్‌లో త్రోబాల్, టెన్నీకాయిట్, బాల్‌బాడ్మింటన్, క్యారమ్స్ లేకపోవడంతో వందలాది మంది విద్యార్థులు నిరాశకు గురయ్యారు. మన రాష్ట్ర విద్యార్థులు ఎక్కువగా మొగ్గుచూపే ఈ ఆటలను జాబితా నుంచి తొలగించడం సరికాదు. కనీసం ఈ ఏడాది అయినా ఈ నాలుగు క్రీడలను తిరిగి జాబితాలో చేర్చేలా రాష్ట్ర ఎస్‌జీఎఫ్ చొరవ తీసుకోవాలి.
– గెంజి కనకారావు, జిల్లా కార్యదర్శి,
టెన్నీకాయిట్ అసోసియేషన్, అనకాపల్లి
ఉపాధినిచ్చే క్రీడలను
తొలగించడం అన్యాయం
గతంలో బాల్ బ్యాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో రాణించిన ఎంతోమంది క్రీడాకారులు రైల్వే, పోలీస్ వంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. క్రీడా కోటాలో ఉపాధి కల్పించే ఇలాంటి విశిష్టమైన క్రీడను రెండేళ్ల నుంచి జాతీయ జాబితా నుంచి తొలగించడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోంది. వచ్చే ఏడాదైనా ఈ క్రీడలను ఎస్జీఎఫ్‌ఐ జాబితాలో చేర్చాలని రాష్ట్ర కార్యదర్శికి విజ్ఞప్తి చేశాం.
– చిరికి వెంకటరావు, అధ్యక్షుడు,
జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం
ఇంటర్ విద్యార్థులకు రెడ్‌కార్పెట్
పాఠశాల విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్య ఎంపిక ప్రక్రియలోనూ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. పాఠశాల విద్యార్థి జిల్లా స్థాయికి రావాలంటే మండల, డివిజన్ స్థాయి పోటీల్లో నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అండర్–17 విభాగంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు నేరుగా ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. ఇది పాఠశాల విద్యార్థులకు తీరని అన్యాయం చేయడమేనని వ్యాయామ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
జనన ధ్రువీకరణ పత్రంతో మరిన్ని చిక్కులు
రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులు తప్పనిసరిగా మున్సిపాలిటీ లేదా పంచాయతీ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని, అది కూడా ఆధార్‌తో సరిపోలాలని నిబంధన పెట్టారు. 15 ఏళ్ల కిందట గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది జనన నమోదు చేసుకోలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా సర్టిఫికెట్ తేవాలంటే సాధ్యం కాక, వచ్చిన అవకాశాలను విద్యార్థులు వదులుకోవాల్సి వస్తోంది.
మంగళం
మంగళం
మంగళం
మంగళం


