వణికిస్తున్న శీతల గాలులు
బీచ్‌రోడ్డు: గత కొద్దిరోజులుగా విశాఖలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడం, మరోవైపు వీస్తున్న శీతల గాలులతో జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన మంచు కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. ఈ మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఛాతీ, ముక్కు సంబంధిత సమస్యలైన ఆస్తమా, సైనసైటిస్, అలర్జీలు, టాన్సిలైటిస్ వంటి వాటితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెదవాల్తేరులోని ఛాతీ ఆసుపత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రితో పాటు విమ్స్‌కు వచ్చే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సమస్యకు కారణాలివే..
శీతాకాలంలో వ్యాప్తి చెందే కొన్ని రకాల వైరస్‌ల వల్ల ఆస్తమా కేసులు పెరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. చల్లని గాలి కారణంగా శ్వాసనాళాలు కుచించుకుపోయి, గాలి రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఆయాసానికి, తద్వారా ఆస్తమాకు దారితీస్తుంది. సాధారణ జలుబు, దగ్గుతో మొదలై రాత్రి వేళల్లో ఇది తీవ్రరూపం దాల్చుతుంది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుందని వైద్యులు తెలిపారు. చల్లని గాలుల వల్ల ముక్కు కండరాలు గట్టిపడటం, దుమ్ము, పుప్పొడి, వాయు కాలుష్యం, పెంపుడు జంతువుల నుంచి వచ్చే అలర్జీలు సైనసైటిస్, టాన్సిలైటిస్ సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి.
చిన్నారులపై తీవ్ర ప్రభావం
పెద్దవారితో పోలిస్తే చిన్నారుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆస్తమా లక్షణాలతో పల్మనాలజిస్టులు, పిల్లల వైద్యుల వద్దకు రోజుకు సగటున 10 నుంచి 20 మంది వరకు వస్తున్నారు. గత రెండు వారాలుగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రధాన లక్షణాలు
పెద్దల్లో ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన ఆయాసం, చిన్నారుల్లో పిల్లి కూతలు రావడం, డొక్కలు ఎగరేయడం, దగ్గు, జ్వరం. ఏడాది లోపు పిల్లల్లో శరీరం నీలంగా మారిపోవడం, సైనస్, టాన్సిల్స్ బాధితుల్లో ఊపిరి అందకపోవడం, గొంతు నొప్పి, ఎడతెగని జలుబు.
రెట్టింపైన బాధితుల సంఖ్య
సాధారణ రోజులతో పోల్చుకుంటే డిసెంబర్‌లో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రెట్టింపయ్యింది. ప్రస్తుతం అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఛాతీ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ల సంఖ్య 90 నుంచి ఏకంగా 170కి పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత రెండేళ్లతో పోల్చితే ప్రస్తుతం కేసుల నమోదు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


