న్యూఇయర్ వేడుకల్లో వ్యక్తి హత్య
గోపాలపట్నం: మద్యం మత్తులో జరిగిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి హత్యకు గురైన ఘటన ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని విమాన్‌నగర్‌లో చోటుచేసుకుంది. గొడవలో కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ నగర్‌కు చెందిన దారపు రమణ, తార బాలరాజు, మైలుపిల్లి దిలీప్ కుమార్(40) నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించేందుకు విమాన్‌నగర్ రైల్వే ట్రాక్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రైల్వే పనుల కోసం వేసిన రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న కూలీలు న్యూ ఇయర్ సందర్భంగా డ్యాన్సులు వేస్తుండగా, వీరు కూడా వారితో కలిసి చిందులేశారు. కొద్దిసేపటి తర్వాత దారపు రమణ, తార బాలరాజు అక్కడి నుంచి వెళ్లిపోగా, దిలీప్‌కుమార్ మాత్రం అక్కడే ఉండి మద్యం సేవించాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవారితో దిలీప్‌కు గొడవ జరిగింది. దీంతో రైల్వే కూలీల్లో ఒకరు కర్రతో దిలీప్ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. ఎంతసేపటికీ దిలీప్ రాకపోవడంతో అతని స్నేహితులు రమణ, బాలరాజు వెనక్కి వచ్చి చూడగా.. అతను రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే వారు అతన్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి దిలీప్ మృతి చెందాడు. మృతుడి భార్య చంద్రిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దిలీప్‌కు భార్య, కుమార్తె పునర్విక, తల్లి సావిత్రి ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య గర్భవతి కావడం అందరినీ కలచివేస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మృతికి కారకులైన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మద్యం మత్తులో ఘటన


