రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కూర్మన్నపాలెం : దువ్వాడ రైల్వేస్టేషన్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు అందించిన వివరాలు.. అగనంపూడి డొంకాడ కాలనీకి చెందిన గుర్రం రాము (25) ఫార్మా కంపెనీలోను, ఆయన భార్య మైత్రి దువ్వాడలోని ఒక షాపులో పనిచేస్తుంది. శుక్రవారం రాత్రి ఆమెను తీసుకురావడానికి రాము స్కూటీపై ఇంటి నుంచి బయలుదేరాడు. దువ్వాడ రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కోళ్లఫారమ్ వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ అతని స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. రాముకు ఏడాది క్రితమే వివాహమైంది. ఆయన మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


