కలుషిత నీటికి చెక్
ప్రారంభించిన జీవీఎంసీ కమిషనర్
డాబాగార్డెన్స్: ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో మొబైల్ నీటి పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. వాటర్ సప్లై కంపెనీ(విస్కో) రూ.40 లక్షల సీఎస్సార్ నిధులతో ఈ మొబైల్ ల్యాబ్‌ను సమకూర్చింది. ప్రజలకు నిరంతరాయంగా సేవలందించేందుకు గానూ డీఎంహెచ్‌వో, జీవీఎంసీ తాగునీటి విభాగానికి దీని నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ వాహనాన్ని జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజుతో కలిసి కమిషనర్ తన బంగ్లా వద్ద గురువారం ప్రారంభించారు. అనంతరం వాహనంలోని నీటి నాణ్యత పరీక్ష పరికరాలను, ప్రయోగశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా మొబైల్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ వాహనంలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్ కెమిస్టులు అందుబాటులో ఉంటారని, వీరు అత్యాధునిక పరికరాల ద్వారా నీటి నాణ్యతను శాసీ్త్రయంగా విశ్లేషిస్తారని వివరించారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ వాహనం వెళ్తుందని, ప్రజలు తాము తాగే నీరు ఎంత వరకు సురక్షితమో అక్కడికక్కడే తెలుసుకోవచ్చని అన్నారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో తయారుచేసిన ఈ వాహనంలో స్పెక్ట్రోఫొటోమీటర్, టర్బిడిటీ మీటర్, డిజిటల్ టైట్రేటర్ వంటి 7 రకాల అధునాతన పరికరాలు ఉన్నాయని తెలిపారు. జీవీఎంసీ వాటర్ సప్లై విభాగం ఆధ్వర్యంలో ఈ వాహనం ప్రతి వార్డులో పర్యటించేలా ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్లు పల్లంరాజు, ఏడుకొండలు, కార్యనిర్వాహక ఇంజినీర్లు మురళీకృష్ణ, శ్రీనివాస్, ఇతర జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.


