వేంకటాద్రిపై విశేష పూజలు
పెందుర్తి: ‘అందరకును నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపుల గడియను తెరువుము. గోప బాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచేయు పఱ అను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట ఇచ్చారు. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చినవారము కాదు. పరిశుద్ధభావముతో వచ్చాం. స్వామీ! ముందుగనే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినొకటి చేరి బిగువుతో నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్మల్ని లోనికి పోనీయవలెను.. అని గోపికలు భవన పాలకుని, ద్వారపాలకుని అర్థించిరి’అంటూ గోదాదేవి సన్నిధిలో 16వ పాశుర సారాంశాన్ని వినిపించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 16 రోజు బుధవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో స్వామిని మేల్కొలిపి హారతి ఇచ్చారు. సేవాకాలం, శాత్తుమురై, తిరుప్పావై పారాయణం శాస్త్రోక్తంగా జరిపారు. తీర్థ గోష్టి, ప్రసాద వితరణ జరిగింది. ఈవో నీలిమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని గురువారం స్వామి నవనీతాలంకరణ(వెన్నతో అలంకారం)లో దర్శనమిస్తారు.
వేంకటాద్రిపై విశేష పూజలు


