నిరంతర కృషితోనే లక్ష్య సాధన
మురళీనగర్ : విద్యార్థులు తమలోని సామర్థ్యాలను తెలుసుకుని నిర్దేశించుకున్న రంగంలో రాణించేందుకు నిరంతరం పనిచేయాలని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ రవికిరణ్ ఈదర అన్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిర్వహిస్తున్న 28వ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు పోటీల ముగింపు సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలోనూ అనేక సామర్థ్యాలు దాగి ఉంటాయని.. వాటిని గుర్తించి నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలన్నారు. స్వీయ అభ్యాసం వ్యక్తిగత అభివృద్ధికి కీలకమని తెలిపారు. ఆలోచించడం, ప్రశ్నించడం ద్వారా జ్ఞానం మరింత విస్తరిస్తుందన్నారు. గెలుపు–ఓటములతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి క్రీడల్లో చురుకుగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు జి.వి.రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ గేమ్స్ కన్నా ఇండోర్, అవుట్‌డోర్ క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.వి.రమణ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి, భీమిలి, పాడేరు, చోడవరం పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్స్ శ్రీనివాసరావు, మురళీకష్ణ, హరిబాబు, గోవింద నాయుడు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
చాంపియన్లు వీరే.. : వ్యక్తిగత అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (బాలురు), వ్యక్తిగత అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (బాలికలు), ఆల్ రౌండ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ (బాలురు), ఆల్ రౌండ్ గేమ్స్ చాంపియన్‌షిప్ (బాలురు), ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్‌షిప్ (బాలురు)గా గిడిజాల సాయిగణపతి పాలిటెక్నిక్ విద్యార్థులు నిలిచారు. బాలికల విభాగంలో ఆల్ రౌండ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్, ఆల్ రౌండ్ గేమ్స్ చాంపియన్‌షిప్ (బాలికలు), ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్‌షిప్‌లను భీమునిపట్నం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ బాలికలు గెలుచుకున్నారు. వీరికి జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ రవికిరణ్ ఈదర చేతుల మీదుగా ట్రోఫీలు అందించారు.
నిరంతర కృషితోనే లక్ష్య సాధన


