అగ్నిమాపక వాహనం, రోడ్ స్వీపింగ్ యంత్రం ప్రారంభం
విశాఖ సిటీ : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అగ్నిమాపక కేంద్రంలో నూతనంగా సమకూర్చుకున్న రోడ్ స్వీపింగ్ యంత్రం, మల్టీపర్పస్ ఫైర్ టెండర్‌ను బుధవారం పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి ప్రారంభించారు. రూ.3.85 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న మల్టీపర్పస్ ఫైర్ టెండర్‌లో 6 కిలోలీటర్ల నీటి ట్యాంక్, 200 లీటర్ల ఫోమ్ కంపౌండ్, 100 కిలోల డ్రై కెమికల్ పౌడర్ (డీసీపీ), 45 కిలోల కార్బన్ డయాకై ్స డ్‌తో పాటు అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్ స్వీపింగ్ మెషిన్‌ను పోర్ట్ పరిధిలోని అంతర్గత రహదారులపై ఏర్పడే దుమ్ము, చెత్త, స్పిల్లేజ్‌ను శుభ్రం చేయడానికి వినియోగించనున్నారు. రూ.4.69 కోట్ల వ్యయంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యంత్రం గంటకు 20 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో అన్ని దిశల్లో శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. పోర్ట్ పరిసర ప్రాంతంలో దుమ్ము, కాలుష్య నియంత్రణకు ఇది మరింత దోహదపడనుంది. కార్యక్రమంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్, పోర్ట్ విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


