దివ్య దర్శనం.. జన్మ ధన్యం
సింహాచలం: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషతల్పంపై కొలువుదీరిన స్వామి వారు, ఉత్తర రాజగోపురం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒక్క రోజు, అది కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శన భాగ్యాన్ని పొంది భక్తులు పులకించిపోయారు.
విశేష వైదిక కార్యక్రమాలు
పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వైదికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వైకుంఠవాసుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మేలిముసుగులో ఉంచి శేషతల్పంపై అధిష్టింపజేసి ఆలయ బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. తొలుత ఆలయ ఉత్తరద్వారం వద్ద స్వామిని ఉంచి, మేలిముసుగు తొలగించారు. సంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులకు తొలి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామిని ఉత్తర రాజగోపురంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేర్చారు. ఉదయం 5.10 గంటల నుంచి 11.15 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అందజేశారు. ఆ తర్వాత సింహగిరి మాడవీధిలో స్వామి వారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు సాతులూరి నరసింహాచార్యులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
ప్రముఖుల దర్శనాలు
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనాన్ని పలువురు ప్రముఖులు చేసుకున్నారు. దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతిరాజు, కుమార్తె ఊర్మిళ గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, పశ్చిమబెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ మంథా, సేల్స్ ట్యాక్స్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, అనకాపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
దివ్య దర్శనం.. జన్మ ధన్యం


