జెడ్పీలో ‘ప్రోటోకాల్’ రగడ
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడీవేడిగా సాగింది. జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకపోవడంపై జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ (విశాఖ), విజయకృష్ణన్(అనకాపల్లి), దినేష్ కుమార్ (ఏఎస్‌ఆర్), సీఈవో నారాయణమూర్తి హాజరయ్యారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్‌ను, 2026–27 సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై సభ్యుల ఫైర్
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల స్థాయిలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీపీలను అధికారులు ఆహ్వానించడం లేదని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు, జడ్పీటీసీలు ఈర్లె అనురాధ, సన్యాసిరాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం తదితరులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పక్కాగా అమలయ్యేదని, ఇప్పుడు తమను గౌరవించడం లేదని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా కొత్తూరులో వీఎంఆర్డీఏ చేపట్టిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించారని ఎంపీపీ సూరిబాబు మండిపడ్డారు. దీనిపై అధికారులను నిలదీసినా సరైన సమాధానం రావడం లేదన్నారు. ప్రోటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆదేశించగా, ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి ప్రకటించారు.
యలమంచిలిని అనకాపల్లిలోనే ఉంచాలి
యలమంచిలి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయడాన్ని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మునగపాక జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట సోము సత్యనారాయణ ఈ అంశాన్ని లేవనెత్తుతూ, అడ్డురోడ్డు ప్రజలకు దూరభారమవుతుందని, అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు.
అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలి
నక్కపల్లి, రాజాయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులకు మద్దతు తెలిపిన సీపీఎం నేత ఎం.అప్పలరాజుపై పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని సభ్యులు తీవ్రంగా ఖండించారు. అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు, వైఎస్సార్ సీపీ సభ్యులు గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై గంజాయి స్మగ్లర్ల తరహాలో పీడీ యాక్ట్ ప్రయోగించడం దారుణమన్నారు. తక్షణమే కేసు ఎత్తివేసి ఆయన్ని విడుదల చేయాలన్నారు.
రోడ్లు, పింఛన్లపై గగ్గోలు
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిపై సభ్యులు గళమెత్తారు. వడ్డాది, చోడవరం, నర్సీపట్నం, గొలుగొండ తదితర ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిందని, గుంతలమయమైన రోడ్లను ఎప్పుడు బాగుచేస్తారని మాడుగుల ఎంపీపీ రాజారామ్, జెడ్పీటీసీ సభ్యురాలు అనురాధ అధికారులను నిలదీశారు. అలాగే, పింఛన్ల ఏరివేత పేరుతో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు అన్యాయం చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు.
కాలుష్యంపై ఆందోళన
పరవాడ, అచ్యుతాపురం పారిశ్రామిక వాడల్లో కాలుష్యం కోరలు చాస్తోందని జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్‌లోడ్ లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నా రవాణా, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. లంకెలపాలెం జంక్షన్‌లో కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


