బార్లకు ఒంటి గంట వరకు పర్మిషన్
అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి
మద్యం విక్రయాలు పెరిగినా..
రాబడి తగ్గింది
మీడియాతో జిల్లా ఎకై ్సజ్ అధికారి ప్రసాద్
బీచ్‌రోడ్డు: జిల్లాలో ఈ ఏడాది మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ.. ఆదాయం మాత్రం తగ్గిందని జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి ఆర్. ప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదిక, రెవెన్యూ క్రైమ్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది మద్యం విక్రయాల ద్వారా రూ.1940.37 కోట్ల ఆదాయం లభించిందని, 2024తో పోలిస్తే ఇది 1.74 శాతం తక్కువని ఆయన వివరించారు. ఈ ఏడాది 23.32 లక్షల కేసుల మద్యం, 17.23 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాల్లో 11 శాతం, బీరు అమ్మకాల్లో 44.8 శాతం వృద్ధి కనిపించిందని తెలిపారు. అలాగే వివిధ నేరాల్లో పట్టుబడిన 14 వాహనాలను జప్తు చేయడం ద్వారా రూ.2.43 లక్షలు, బైన్డ్ ఓవర్ ఉల్లంఘనల ద్వారా రూ.2.14 లక్షలు, లోక్ అదాలత్ కేసుల పరిష్కారం ద్వారా రూ.30.18 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 150 మద్యం షాపులు, 75 బార్లు, 18 స్టార్ హోటళ్లు, 7 క్లబ్బులు, 8 మైక్రో బ్రేవరీలు, 2 ప్రీమియం స్టోర్లు, 19 డిఫెన్స్ క్యాంటీన్లు నిర్వహణలో ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 2025 సంవత్సరానికి లైసెన్సు ఫీజుల రూపంలో రూ.204 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పర్మిట్ రూమ్స్ ద్వారా రూ.8.77 కోట్లు, వన్ డే ఈవెంట్ పర్మిట్ల ద్వారా రూ.14.82 లక్షల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. ఈ ఏడాది మొత్తం 442 అనధికార మద్యం అమ్మకపు(బెల్ట్ షాప్) కేసులు నమోదు చేసి, 443 మందిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి 883.76 లీటర్ల మద్యం, 65.65 లీటర్ల బీరు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుంకం చెల్లించని మద్యం (ఎన్‌డీపీఎల్) తరలిస్తున్న 67 కేసుల్లో 60 మందిని అరెస్టు చేసి.. 680 లీటర్ల మద్యం, 24.3 లీటర్ల బీరు, 6 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. 8 గంజాయి కేసుల్లో 15 మందిని అరెస్టు చేసి, 67.23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
వేడుకలకు సమయం పెంపు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు.. బార్లు, స్టార్ హోటళ్లు, టూరిజం బార్లు, ప్రత్యేక అనుమతి పొందిన ఈవెంట్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రసాద్ తెలిపారు. వేడుకల కోసం ఇప్పటివరకు 14 మంది వన్ డే ఈవెంట్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, పోలీసు శాఖ సమన్వయంతో అనుమతులు ఇస్తామని చెప్పారు. వేడుకల్లో అనుమతి లేని విదేశీ మద్యం గానీ, ఇతర రాష్ట్రాల మద్యం గానీ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ అధికారి హెచ్చరించారు.


