బ్యాంక్ అభివృద్ధిలో ‘ఆఫీసర్స్ అసోసియేషన్’ పాత్ర కీలక
కొమ్మాది: కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ 20వ త్రైవార్షిక జాతీయ మహాసభలు సోమవారం ఘనంగా ముగిశాయి. రాడిసన్ బ్లూ హోటల్‌లో మూడు రోజులుగా జరుగుతున్న ఈ సభలను ఉద్దేశించి కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కె.సత్యనారాయణ మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధిలో బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. తెలుగు యువకుడైన కె.రవికుమార్ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అధికారులందరూ ఏకధాటిపై నడిచి అందిస్తున్న బ్యాంకింగ్ సేవలు దేశ ప్రగతికి ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. అనంతరం సత్యనారాయణరాజు జీవితంలో ఎదిగిన క్రమాన్ని అసోసియేషన్ పొందుపరిచిన ది మాస్టర్ స్టిచ్ అనే పుస్తకాన్ని ఆయన మాతృమూర్తి రామసీత చేతుల మీదుగా ఆవిష్కరించారు. జనరల్ సెక్రెటరీ కె.రవికుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ అధికారుల ఐకమత్యమే బలమని.. దానికి నిదర్శనమే దేశంలో అతి పెద్ద ట్రేడ్ యూనియన్‌గా నిలవడమన్నారు. కెనరా బ్యాంక్ ఈ మూడు సంవత్సరాల్లో రూ.7 లక్షల కోట్ల బిజినెస్ పెంచగలిగిందని దానికి బ్యాంక్ అధికారుల కృషే కారణమన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు విస్తృత చర్చల్లో పాల్గొని బ్యాంకు అధికారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి వంద తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారన్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల వచ్చే మార్పులకు సిద్ధం కావాలన్నారు.
ముగిసిన కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ 20వ త్రైవార్షిక జాతీయ మహాసభలు


