ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: అనుకున్న ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ద్వారకా పోలీసుల వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా, కొర్లం గ్రామానికి చెందిన సంపత్, ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని మధురానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉద్యోగం లభించకపోవడం ఒకవైపు, దీనికి తోడు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్‌పై తీసుకున్న ద్విచక్ర వాహనం ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన సంపత్ సోమవారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు ఎవరూ కారణం కారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను.. అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ద్వారకా పోలీసులు తెలిపారు.


