తెలుగు భాష రక్షణకు ‘టిట్టిభ సత్యాగ్రహం’
బీచ్‌రోడ్డు: తెలుగుభాష రక్షణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వంతో అమీతుమీ తెల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి ప్రకటించారు. తెలుగు భాషా రక్షణ కోసం విశాఖ మహానగరంలో కవులు, కళాకారులు, భాషాభిమానులు చేపట్టిన నిరసనలో భాగంగా, తెలుగు దండు ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ పార్కులో ‘టిట్టిభ సత్యాగ్రహం’కు శ్రీకారం చుట్టామన్నారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం తెలుగు భాషా సూర్యుడు సీపీ బ్రౌన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షకు సంకల్పం చెప్పుకున్న పరవస్తు సూరి మాట్లాడుతూ తెలుగు తల్లి మన దేశవాళీ పాలకుల చేతుల్లో దగా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష, సంస్కృతి ఈ జాతి సొత్తు అని, దానిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని, దీనిపై రాజకీయుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఈ నిరవధిక నిరాహార నిరసన దీక్షను ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. నిరసనలో పాల్గొన్న పలువురు వక్తలు తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ప్రభుత్వంతో పేచీ లేదని, కేవలం పాలకులతోనే పంచాయతీ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు కనీసం ‘అధికార భాషా సంఘం’ కూడా ఏర్పాటు చేయకపోవడం వారి మాతృభాషాభిమానానికి నిదర్శనమన్నారు. దీక్షా కార్యక్రమంలో తిరుపతి రాజమన్నార్, ఆచార్య ప్రసాద్, అడపా రామకృష్ణ, ఆచార్య సూరప్పడు, ప్రజాకవి దేవిశ్రీ, ఎర్రం నాయుడు, నరహరిశెట్టీ శ్రీధర్, చేబియ్యం మోహన్, హేమా, పంతుల లలిత, మువ్వల రాంబాబు, కానాల భారతి, కోరుకొండ రంగారావు, ఇమంది ఈశ్వరరావు, సీతాదేవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


