స్ఫూర్తి నింపేందుకు పోటీలు
కొమ్మాది: ‘జన జాతీయ గౌరవ దివస్ – 2025’లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ (టీసీఆర్‌టీఎం) ఆధ్వర్యంలో గీతం కళాశాల ప్రాంగణంలో సోమవారం గిరిజన క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. టీసీఆర్‌టీఎం ఈడీ డా. రాణి మందా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ క్రీడలు దోహదపడతాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, ఆర్‌సీ వరం, కేఆర్ పురం, చిత్తూరు, శ్రీశైలం, నెల్లూరు ఐటీడీఏల నుంచి గిరిజన విద్యార్థులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు కబడ్డీ, వాలీబాల్, విలువిద్య వంటి పోటీల్లో పాల్గొన్నారు. రంగురంగుల కవాతు, క్రీడా జ్యోతులు, గిరిజన నృత్య ప్రదర్శనలు, జానపద సంగీతం, హస్తకళల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రీడా సంబరాలు రెండు రోజులు జరుగుతాయని, ముగింపు రోజున విజేతలకు బహుమతులు అందిస్తామని ఈడీ తెలిపారు.
ఎమ్మెల్యే గంటా గైర్హాజరుపై అసహనం
క్రీడా పోటీలను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించాల్సి ఉంది. ఆయన రాక కోసం మూడు గంటల పాటు అధికారులు, విద్యార్థులు, కళాకారులు ఎండలో నిరీక్షించారు. క్రీడా పోటీలు జరుగుతున్న సమీప ప్రాంతం నుంచే ఆయన వెళ్లిపోవడంతో అధికారులు, హాజరైన వారంతా అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గైర్హాజరు కారణంగా గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉత్సాహంగా ప్రారంభమైన
గిరిజన క్రీడా పోటీలు
స్ఫూర్తి నింపేందుకు పోటీలు


