
మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణంపై దృష్టి
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ పరిధిలోని మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని ఆ సంస్థ చైర్మన్ ప్రణవ్‌గోపాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో బృహత్తర ప్రణాళిక రహదారుల పనుల పురోగతిపై ఆయన అధికారులు, కాంట్రాకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి రహదారులను వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. జీవీఎంసీతో సమన్వయం చేసుకుంటూ.. భూమిని ఇచ్చిన లబ్ధిదారులకు టీడీఆర్‌లను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు లేకుండా స్పష్టంగా ఉన్న ప్రాంతాల్లో పెగ్ మార్కింగ్ చేసి పనులను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అటవీ శాఖకు చెందిన భూములున్న మార్గాల్లో పనులు చేసేందుకు అనుమతులు వేగంగా వచ్చేలా సంబంధిత అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించాలన్నారు. జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజినీర్లు రామరాజు, రాంబాబు, సుధీర్, వరుణ్ కార్తీక్ పాల్గొన్నారు.