
● కోర్టు వివాదంలోని స్థలం కబ్జాకు యత్నం ● రక్షణ కల్పించ
మధురవాడ: విశాఖ రూరల్ మండలం, మధురవాడలోని మిథిలాపురి వుడా కాలనీలో కోర్టు వివాదంలో ఉన్న స్థలంలోకి కొందరు వ్యక్తులు చిల్లర రౌడీలతో ప్రవేశించి ఫెన్సింగ్ పనులు చేస్తున్నారని స్థల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. పీఎంపాలెం పోలీసులు ఎవరినీ భూమిలోకి వెళ్లవద్దని ఆదేశించినప్పటికీ, తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. గురువారం స్థల యజమాని ఎం.బి.శ్రీనివాస్, కుటుంబ సభ్యులు సరోజాదేవి, పద్మజ తదితరులు మీడియాతో మాట్లాడారు. ఫెన్సింగ్ వేయడానికి వచ్చిన వారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనుషులమంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి 630 గజాలను 1991లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో 221 గజాలను చర్చికి విక్రయించామన్నారు. ల్యాండ్ రికార్డులు, ఈసీలో కూడా తమ పేర్లే చూపుతున్నప్పటికీ.. ప్రత్యర్థి వర్గం దౌర్జన్యానికి దిగుతోందని వాపోయారు. ఈ భూమికి సంబంధించి కోర్టు వివాదంలో ఉందని, పీఎల్‌సీఎఫ్‌లో కూడా పెండింగ్‌లో ఉందని తెలిపారు. భూమిలోకి అక్రమ ప్రవేశంపై తాము 112 నంబర్‌కు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వచ్చి పనులను ఆపమని హెచ్చరించారు. అయితే కొద్దిసేపు ఆగిన తర్వాత, వారు మళ్లీ యథావిధిగా పనులు కొనసాగించడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన వారి నుంచి తమకు, తమ ఆస్తికి తక్షణమే రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు, నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.