‘గోదావరి’ కోసం అంత తొందరేంటో? | - | Sakshi
Sakshi News home page

‘గోదావరి’ కోసం అంత తొందరేంటో?

Oct 17 2025 6:44 AM | Updated on Oct 17 2025 6:44 AM

‘గోదావరి’ కోసం అంత తొందరేంటో?

‘గోదావరి’ కోసం అంత తొందరేంటో?

రూ.950 కోట్ల వ్యయంతో

భారీ డ్రెడ్జర్‌ నిర్మాణం

పనులు పూర్తవ్వకముందే

ప్రారంభించేందుకు సన్నాహాలు

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ అధికారి

అత్యుత్సాహం

18నే ప్రారంభించేందుకు ఏర్పాట్లు

సాక్షి, విశాఖపట్నం: సంస్థలన్నింటిలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) తీరు వేరు అన్నట్లుగా ఉంది ఇక్కడి అధికారుల వ్యవహారం. నిర్మాణం పూర్తికాకుండానే డ్రెడ్జర్‌ను ప్రారంభించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొచ్చిన్‌ షిప్‌యార్డులో నిర్మితమవుతున్న భారీ డ్రెడ్జర్‌ ‘గోదావరి’ని ఈ నెల 18న ప్రారంభించేందుకు (కమిషనింగ్‌) డీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి దీని పనులు పూర్తవ్వాలంటే మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ కొత్తగా ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న ఓ అధికారి.. తన హయాంలోనే ఈ అతిపెద్ద డ్రెడ్జర్‌ ప్రారంభమైందని చెప్పుకోవాలనే అత్యాశతోనే ఈ అడ్డగోలు కార్యక్రమానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

డీసీఐలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారి పదవిలో ఉన్నా లేకపోయినా.. అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఓ అధికారి అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటూ డీసీఐ పరువును బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంస్థ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టుల నుంచి బదిలీల వరకు అన్నింటా ఆయన చెప్పిందే శాసనంగా మారిందని అంటున్నారు. తాజాగా ‘గోదావరి’ డ్రెడ్జర్‌ ప్రారంభోత్సవం విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

బాస్‌ వస్తే.. తనకు పేరు రాదని..!

భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత అధునాతనమైన ‘గోదావరి’ డ్రెడ్జర్‌ను ఈ నెల 18న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు పూర్తికాకుండా కమిషనింగ్‌ చేయడం వెనుక సదరు అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన నియామకంపై ఉత్తర్వులు వెలువడేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఆయన మరో మూడు నెలల పాటు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయి బాస్‌ వస్తే.. ఈ ఘనత తన ఖాతాలో చేరదనేది ఆ అధికారి దూరదృష్టిగా కనిపిస్తోంది. అందుకే అతిపెద్ద డ్రెడ్జర్‌ ప్రారంభోత్సవం తన హయాంలోనే జరిగిందన్న పేరు నిలిచిపోవాలని ఆదరాబాదరాగా ఈ కార్యక్రమానికి తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, డీసీఐ ఉన్నతాధికారి పోస్టుకు బోర్డు ప్యానల్‌ ముగ్గురు అనుభవజ్ఞులను ఎంపిక చేసింది. వీరిని ఇంటర్వ్యూ చేసి ఒకరిని నియమించాల్సి ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఎంపికై నా తన ప్రాధాన్యత తగ్గుతుందనే భయంతో ఆ అధికారి.. ఆ ఫైల్‌ ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారని కూడా తెలుస్తోంది.

‘గోదావరి’వస్తే డీసీఐ బలోపేతం

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ‘గోదావరి’ట్రయిలింగ్‌ సక్షన్‌ హాపర్‌ డ్రెడ్జర్‌(టీఎస్‌హెచ్‌డీ)ని డీసీఐ నిర్మిస్తోంది. సుమారు రూ.950 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంటోంది. భారత సముద్ర రవాణా సామర్థ్యంలో ‘గోదావరి’ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఇది 127 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో నిర్మితమవుతోంది. ప్రస్తుతం డీసీఐ వద్ద 10 ట్రయిలింగ్‌ సక్షన్‌ హాపర్‌ డ్రెడ్జర్లు, ఒక కట్టర్‌ సెక్షన్‌ హాపర్‌ డ్రెడ్జర్‌, ఒక బ్యాక్‌ హో డంబ్‌నాన్‌ ప్రొపెల్లడ్‌, ఒక ఇన్‌లాండ్‌ కట్టర్‌ సక్షన్‌ డ్రెడ్జర్లు ఉన్నాయి. వీటన్నింటి సామర్థ్యం 59,000 క్యూబిక్‌ మీటర్లు కాగా.. ‘గోదావరి’ ఒక్కదాని సామర్థ్యమే 12,000 క్యూబిక్‌ మీటర్లు. అంటే.. గోదావరి చేరిన తర్వాత డీసీఐ మొత్తం సామర్థ్యం 71,000 క్యూబిక్‌ మీటర్లకు చేరనుంది. ఇంతటి ప్రతిష్టాత్మక డ్రెడ్జర్‌ తయారీ విషయంలో సదరు అధికారి తన స్వప్రయోజనం చూసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పనులు పూర్తి కాకున్నా.. ప్రారంభించేద్దాం!

భారతదేశంలోనే అతిపెద్ద డ్రెడ్జర్‌ను డీసీఐ నిర్మిస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన రాయల్‌ ఐహెచ్‌సీ సహకారంతో కొచ్చిన్‌ షిప్‌యార్డులో తయారవుతున్న ఈ డ్రెడ్జర్‌ కీల్‌ (నిర్మాణంలో ప్రధాన దశ)ను 2024 సెప్టెంబర్‌లో కేంద్ర షిప్పింగ్‌, జలరవాణా శాఖామంత్రి సర్బానంద సోనోవాల్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఈ డ్రెడ్జర్‌కు ‘బ్రహ్మపుత్ర’అని కేంద్ర మంత్రిత్వ శాఖ పేరు సూచించగా.. తర్వాత ‘గోదావరి’గా మార్చారు. ప్రస్తుతం ఈ నౌకా నిర్మాణం ట్రయల్‌ రన్‌ దశలో ఉంది. ఒకటి రెండు ట్రయల్‌ రన్స్‌ నిర్వహించి, లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిచేశాకే కమిషనింగ్‌ చేస్తారు. ఇందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని షిప్‌యార్డు వర్గాలు స్పష్టం చేస్తున్నా.. డీసీఐ మాత్రం పనులు పూర్తి కాకున్నా ఫర్వాలేదు, ఈ నెలలోనే ప్రారంభించేద్దామని తొందరపెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement