
స్నేహితుడిని పరామర్శించి వస్తూ మృత్యువాత
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
గోపాలపట్నం: చేతికి అందివచ్చి.. ఇంటికి అండగా ఉంటున్న కొడుకు మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆరు నెలల కిందట చెల్లెలి పెళ్లి చేసి మురిసిన అన్నయ్య.. ఈ రోజు కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయాడు. స్నేహితుడిని పరామర్శించి వస్తున్న ఆ యువకుడిని మృత్యువు రోడ్డు రూపంలో కబళించింది. వేపగుంటలో ఉంటున్న స్నేహితుడికి తేలు కుట్టిందని తెలిసి పరామర్శించేందుకు బుధవారం రాత్రి వెళ్లిన బొడ్డేడ వంశీ (24) తిరిగి ఇంటికి వస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. అక్కయ్యపాలెంలో నివాసముంటున్న వంశీ స్వస్థలం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చేమలాపల్లి. ట్రావెల్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన ద్విచక్రవాహనంపై వేపగుంట నుంచి వస్తుండగా.. ఆర్‌అండ్‌బీ జంక్షన్ సమీపంలో వెనుకనే అతివేగంగా వస్తున్న లారీ అతన్ని ఢీకొట్టింది. ఈ ధాటికి అదుపుతప్పిన వంశీ లారీ చక్రాల కింద పడి నలిగిపోయాడు. లారీ అతన్ని సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో వంశీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబానికి అండగా ఉంటున్న కుమారుడు అకాల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి రామకృష్ణ లారస్ సంస్థలో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నారు. బుద్ధిమంతుడైన కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక వారు పడుతున్న వేదన అక్కడివారిని సైతం కంటతడి పెట్టించింది. ఆరు నెలల కిందటే వంశీ తన చెల్లెలు కావ్యకు అన్నీ తానై వివాహం జరిపించాడు. ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా మరువకముందే.. అన్న మరణవార్త విన్న కావ్య కన్నీటి పర్యంతమైంది. తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.