తాటిచెట్లపాలెం: అక్కయ్యపాలెంలోని నందగిరినగర్‌లో బుధవారం సాయంత్రం జరిగిన కావల శ్రావణ సంధ్య అలియాస్ సోని(38) దారుణ హత్యకు పాత గొడవలే కారణమని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ కేసు వివరాలను ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. శ్రావణ సంధ్యకు 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భర్త మణికంఠతో మనస్పర్థల కారణంగా విడిపోయి, గత ఏడేళ్లుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి నందగిరినగర్‌లో నివసిస్తోంది. మణికంఠ ప్రస్తుతం రాయగడలో ఉంటున్నాడు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. నిందితుడు శ్రీను(కార్పెంటర్) కూడా అదే ప్రాంతంలో, తన సోదరుడి ఇంట్లో నివసిస్తున్నాడు. సుమారు 8 నెలల కిందట శ్రీను.. శ్రావణ సంధ్య స్కూటీని డామేజ్ చేయడంతో, ఆమె ఫోర్త్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పుడు పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చినా, శ్రీను ఆమైపె పగ పెంచుకున్నాడు. దీనికితోడు శ్రీను తరచుగా మరొక అమ్మాయితో మాట్లాడడాన్ని గమనించిన శ్రావణసంధ్య, అతడిని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మళ్లీ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న శ్రీను.. కోపం పెరిగి, కార్పెంటరీ పనుల కోసం ఉపయోగించే పదునైన కత్తితో శ్రావణ సంధ్య మెడపై తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతురాలి సోదరి దేవి సంతోషికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం శ్రీను తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. ఫోర్త్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్ ఉమాకాంత్ తన బృందంతో మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న ఫోర్త్‌టౌన్ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ–1 మేరి ప్రశాంతి అభినందించారు.
పాత కక్షతోనే వివాహిత హత్య