
రైతులపై టీడీపీ నాయకుల దాడి
తగరపువలస: టీడీపీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. భూములను కాజేసేందుకు రైతులపై దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఆనందపురం మండల పరిధిలో బడుగు రైతులైన తండ్రీ కొడుకులపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. ఆనందపురం గ్రామపంచాయతీలో రైతులైన తండ్రీ కొడుకులు చందక సన్యాసప్పడు, శివకుమార్‌లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బుధవారం రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కల్లంలో పనులు చేసుకుంటున్న తండ్రీ కొడుకుల వద్దకు వచ్చిన షిణగం పెద రామారావు, లెంక సన్యాసప్పడు, లెంక నారాయణమ్మ, లెంక నారాయణరావు, లెంక నరసింగరావు కొన్ని దస్తావేజులు తీసుకువచ్చి, వీరి ఫోన్లు లాక్కున్నారు. సంతకాలు చేయాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అయినప్పటికీ వినకపోవడంతో కర్రలు, కత్తులు, ఐరన్ రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వీరికి ఛాతీ, తల, వెన్నెముక భాగంలో గాయాలయ్యాయి. తొలుత బాధితులు ఆనందపురం పీహెచ్‌సీకి వెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం కేజీహెచ్‌కు వెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. కానీ, 108 సిబ్బంది వీరిని భీమిలి సీహెచ్‌సీకి తరలించి అవసరమైతే ఆటోలో కేజీహెచ్‌కు వెళ్లాలని చెప్పి ఊరుకున్నారు. దీంతో బాధితులు సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రికి వెళ్లారు.
గతంలోనూ రెండుసార్లు దాడి
బాధితులు సన్యాసప్పడు, శివకుమార్ మాట్లాడుతూ గతంలో వీఆర్వో త్రినాఽథ్, తహసీల్దార్ అంబేడ్కర్ సాయంతో తమకు చెందిన రెండు ఎకరాల భూమి రికార్డులు మార్చి, దొడ్డిదారిన పై టీడీపీ నాయకులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2004, 2014లో కూడా ఇదే విధంగా తమపై దాడికి పాల్పడ్డారన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూమిని కాజేసి తరచూ దాడులకు పాల్పడుతున్న వీరినుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఏడాది క్రితం తమ వ్యవసాయభూమికి విద్యుత్ వైర్లు కట్ చేయించి, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా వీరే ఎత్తుకువెళ్లి రెండు నెలల పాటు వ్యవసాయాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. వీరిపై ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.