మధురవాడ: రుషికొండ భవనాలు నాట్ ఫర్ సేల్ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన తెలిపింది. బుధవారం మధురవాడ ఐటీ సెజ్, రుషికొండ భవనాలు తదితర ప్రాంతాల్లో బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జన జాగరణ సమితి ఉత్తరాంధ్ర కన్వీనర్ తాళ్లవలస దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడి, చేతకానితనంతో రుషికొండ భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రుషికొండ సముద్ర తీరంలో ఎంతో విలువైన భవనాలు నిర్మించిందన్నారు. కూటమి ప్రభుత్వానికి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వానికి వీటిని అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన రుషికొండ భవనాలను రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలుగా.. లేకపోతే నేవీ నార్త్ కమాండ్ మ్యూజియంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కూటమి ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.