
కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలి
మహారాణిపేట : కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయడంతోపాటు తక్షణమే మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని, పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూ.కూర్మారావు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా పరిషత్ ఆవరణలో జిల్లా కార్యవర్గ సంఘం సమావేశం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మారావు మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటీ, ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఈనెల 27న ఏలూరులో జరిగే రాష్ట్ర సభ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరు కావాలన్నారు. పెన్షనర్లకు బకాయి డీఏలతోపాటు మెడికల్ రీయింబర్స్‌మెంట్, తదితర అన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటివరకు 11వ వేతన సవరణ బకాయిలను చెల్లించలేదన్నారు. గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్న 12వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పటి వరకు నియమించలేదన్నారు. పింఛనుదారుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆర్.కృష్ణకుమార్, ఇతర నాయకులు డి.ఎస్.కె.ప్రకాష్, వి.వెంకటేశ్వరరావు, పి.సత్యనారాయణ, బాపిరాజు తదితర సభ్యులు పాల్గొన్నారు.