
‘రుషికొండ భవనాలపై తదుపరి చర్యల్ని ఆపాలి’
సీతంపేట: ఏపీ టూరిజం అథారిటీ పర్యావరణ నియమాలు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రుషికొండ భవనాలను అక్రమంగా ఉపయోగించుకునే ప్రతిపాదనలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుషికొండ భవనాల కోసం హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీసుకు సంబంధించి ఈ నెల 11న టూరిజం అథారిటీ పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ హాస్పిటాలిటీ ఆపరేటర్ల కోసం రుషికొండ భవానాల వినియోగంపై ఈ నెల 17న విజయవాడ టూరిజం కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని ఎంపిక చేసిన వాట్సాప్ గ్రూపుల్లో, వైబ్‌సైట్లలో పెట్టినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. హైకోర్టులో డబ్ల్యూపీ(పిల్) నెం.241/2021లో పిటిషనర్‌గా ఉన్నానని, కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఈలోగా ఇలాంటి పబ్లిక్ నోటీసులు సరికాదన్నారు. అధికారులు తదుపరి చర్యలను ఆపకపోతే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు.