
జీఎస్టీ 2.0తో సామాన్యులకు మేలు
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
ఏయూక్యాంపస్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 విధానంతో సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుధవారం బీచ్‌రోడ్డులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని స్టేట్ జీఎస్టీ అడిషనల్ కమిషనర్ సీతాలమ్ శేఖర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా బీచ్‌లో ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ప్రారంభించి, ర్యాలీకి జెండా ఊపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. నూతన జీఎస్టీ విధానం పర్యాటక రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో తీర్థయాత్రలు, వినోద ప్రయాణాలు చేయడం సాధ్యపడుతుందన్నారు. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల స్థానికంగా ఉండే దుకాణాలు, రెస్టారెంట్‌లు, హస్తకళల వ్యాపారాలు లాభపడతాయని వివరించారు. సీతాలమ్ శేఖర్ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 విధానంలో రవాణా, కేటరింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతుందన్నారు. జిల్లా పర్యాటక అధికారి జె.మాధవి, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్, సీనియర్ అడ్మిన్ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.