
‘గూగుల్’కు భూములు ఇవ్వం
తర్లువాడ దళిత రైతుల స్పష్టీకరణ
తగరపువలస: ఆనందపురం మండలం తర్లువాడకు చెందిన దళిత రైతులు.. తమ భూములను గూగుల్ టెక్‌కు ఇవ్వబోమని స్పష్టం చేశారు. బుధవారం రైతులతో భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, తహసీల్దార్ సూరిశెట్టి శ్రీనుబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతుల తరఫున సీపీఎం భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్.ఎస్.ఎన్.మూర్తి మాట్లాడారు. ప్రకృతిని ధ్వంసం చేసి, వ్యవసాయ భూముల్లో ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేయవద్దన్నారు. వాటిని ప్రత్యేక పారిశ్రామిక ప్రాంతాల్లోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. గూగుల్ సెంటర్ కోసం భూములు తీసుకుని ఇచ్చే పరిహారం, ఉద్యోగాలు తమకు వద్దంటూ రైతులు నినాదాలు చేశారు. ఆర్డీవో చేసిన ప్రతిపాదనలను తిరస్కరించారు. ‘మా పొట్ట కొట్టి కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది’అని ఆరోపించారు. సీపీఎం ప్రతినిధి ఎస్.అప్పలనాయుడు పాల్గొన్నారు.