దివ్యాంగులకు మళ్లీ అగ్ని పరీక్ష | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు మళ్లీ అగ్ని పరీక్ష

Oct 9 2025 2:37 AM | Updated on Oct 9 2025 2:37 AM

దివ్యాంగులకు మళ్లీ అగ్ని పరీక్ష

దివ్యాంగులకు మళ్లీ అగ్ని పరీక్ష

● సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌ ● తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అపీల్‌ చేసుకున్న దివ్యాంగులకు పరీక్షలు

మహారాణిపేట: దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. వీరిపై కనికరం లేకుండా పరీక్షల పేరుతో అష్టకష్టాలు పెడుతోంది. ఇప్పటికే 1,178 మంది దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని జాబితాను సిద్ధం చేసింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. వివిధ కేటగిరీల్లో ఉన్న దివ్యాంగులు పింఛన్ల అపీల్‌ చేసుకోవడంతో వారికి గత నెల పింఛన్లు మంజూరు చేసింది. దివ్యాంగుల పింఛన్లలో భారీగా కోత విధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. అపీల్‌ చేసుకున్న దివ్యాంగులకు మళ్లీ పరీక్షలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, బుధ, గురు, శుక్రవారాల్లో నగరంలోని నిర్దేశిత ఆస్పత్రుల్లో సర్టిఫికెట్లను వెరిఫై చేయాలని ఆదేశించడం.. దివ్యాంగుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఆందోళనలో అభాగ్యులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పింఛన్లకు ఎప్పుడు ఎసరు వస్తుందోనన్న భయాందోళనతో దివ్యాంగులు కాలం వెళ్లదీస్తున్నారు. రీవెరిఫికేషన్‌ పేరుతో ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పునఃపరిశీలనలో తమ వైకల్య శాతాన్ని తగ్గిస్తారేమోనని, లేదా సర్టిఫికెట్‌ను పూర్తిగా రద్దు చేస్తారేమోనని మదనపడుతున్నారు. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోతే మరుసటి నెల నుంచే పింఛన్‌ కట్‌ చేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. మంచానపడిన వారిని, మానసిక వికలాంగులను సైతం వదలకుండా నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ కనికరలేని వైఖరికి నిదర్శనమని వారు వాపోతున్నారు.

ఏరివేతే లక్ష్యంగా..

దివ్యాంగుల పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ర్యాండమ్‌ సర్వేలు, మంచం మీద ఉన్నవారికి ఇంటివద్దకే వెళ్లి రీవెరిఫికేషన్‌లు నిర్వహించారు. ఇప్పుడు 50 శాతం లోపు వైకల్యం ఉన్నవారికి, గతంలో పింఛన్‌ నిలుపుదలపై అప్పీల్‌ చేసుకున్న వారికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలో 1,178 మంది పింఛన్లను తొలగించేందుకు జాబితా సిద్ధం చేయడం ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. వ్యతిరేకత రావడంతో గత నెల పింఛన్లు విడుదల చేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పరీక్షల పేరుతో వారిని వేధించడం దారుణం.

కక్షసాధింపు తగదు

జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగుల పింఛనుదారులు ఉండగా, ఇప్పటికే 16,187 మంది రీవెరిఫికేషన్‌ పూర్తయింది. ఇంకా 5,119 మందికి ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. పరీక్షలు చేసిన వారిలో 1,178 మంది దివ్యాంగుల పింఛన్లకు ఎసరు వచ్చింది. వీరికి కేజీహెచ్‌, అగనంపూడి ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో వైద్యుల బృందం సదరం సర్టిఫికెట్లను పరిశీలన చేయనుంది. పుట్టుకతోనే వైకల్యంతో బాధపడుతూ, మరొకరి సాయం లేనిదే కదలలేని అభాగ్యులపై ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అమానవీయమని, ఈ రీవెరిఫికేషన్‌ నిబంధనలు తమకు శాపంగా మారాయని దివ్యాంగులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement