
ఏసీబీకి చిక్కిన సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్
మల్కాపురం : ఓ ఇంటి సర్వే నెంబర్ మార్పు కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటున్న సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్‌లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ములగాడ తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా రంగోలి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్‌గా కర్రి నగేష్ పనిచేస్తున్నారు. ములగాడ మండల పరిధిలో బొడ్డేపల్లి రవితేజ అనే వ్యక్తి ఇంటికి సంబంధించి సర్వే నెంబర్ తప్పుగా వచ్చింది. దీంతో అతడు తన సర్వే నెంబర్ సరిచేయాలని ఇటీవల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్ ఇటీవల రవితేజ ఇంటికి వెళ్లి సర్వే చేశారు. సర్వే సర్టిఫి కెట్ (ఎండార్స్‌మెంట్ సర్టిఫికెట్) కావాలంటే రూ.30 వేలు అవుతుందని డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఇచ్చేందుకు పంజాబ్ దాబా జంక్షన్ వద్ద గల సచివాలయానికి రావాలని చెప్పారు. ఈక్రమంలో రవితేజ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం అతడు పంజాబ్ జంక్షన్ వద్ద సచివాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ నగేష్, సర్వేయర్ సత్యనారాయణకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ములగాడ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు సర్వేయర్ రూమ్‌లో ఫైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం హాజరుపరచనున్నారు.