రూ.లక్ష లేదట | - | Sakshi
Sakshi News home page

రూ.లక్ష లేదట

Sep 27 2025 4:27 AM | Updated on Sep 27 2025 4:27 AM

రూ.లక

రూ.లక్ష లేదట

వీసీ బంగ్లాకు రూ.64 లక్షలతో మరమ్మతులు
డాక్టర్‌ క్వార్టర్‌కు

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏయూ రిజిస్ట్రార్‌ మొన్నటివరకు నివసించిన బంగ్లా. ఇప్పుడు ప్రస్తుత వీసీ రాజశేఖర్‌ నివాసం ఉంటున్నారు. తాను నివాసం ఉండేందుకు వీలుగా వీసీ ఏకంగా రూ.64 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించుకున్నారు. అయితే డాక్టర్‌ క్వార్టర్‌ మరమ్మతులకు రూ.లక్ష మంజూరు చేసేందుకు మాత్రం ససేమిరా అంటూ వీసీ మోకాలడ్డారు. ఏయూ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ అందుబాటులో లేకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. విద్యార్థి మరణం నేపథ్యంలో వీసీ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

తాను ఉండేందుకు రిజిస్ట్రార్‌ బంగ్లాను రూ.64 లక్షలతో మరమ్మతులు చేయించుకున్న ఏయూ వీసీ రాజశేఖర్‌.. ఏయూ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్‌ నివాసం ఉండేందుకు లక్ష రూపాయలతో క్వార్టర్‌లో మరమ్మతులు చేయించాలని కోరినా పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. విద్యార్థి మరణంపై విద్యార్థులు ఇంత తీవ్రస్థాయిలో స్పందించేందుకూ వీసీ వైఖరే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వీసీ తన బంగ్లాలో ఉందామనుకుని.. ఐఐటీ నుంచి ప్రత్యేక టీమ్‌తో మరమ్మతులు చేయించుకునేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈ బంగ్లా నివసించేందుకు అంతగా అవకాశం లేదని తేల్చిచెప్పడంతో రిజిస్ట్రార్‌ బంగ్లాలో నివాసం ఉండాలని వీసీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనుకున్న వెంటనే ఈ బంగ్లాలో మరమ్మతుల పేరిట భారీగా వెచ్చించేందుకు సమాయత్తం కావడంతో పాటు ఇప్పటికే రూ. 64 లక్షల మేర ఖర్చు చేసినట్టు సమాచారం. ఒకవైపు తన బంగ్లా కోసం లక్షలకు లక్షలు తగలేస్నున్న వీసీ... డాక్టర్‌ కోసం క్వార్టర్‌ మరమ్మతుకు రూ.లక్ష ఖర్చు ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏకంగా ఆరుసార్లు ఫైలును పంపినప్పటికీ తిప్పిపంపడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఏయూలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత వివాదాలను ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నవన్న మంత్రి లోకేష్‌ వ్యాఖ్యలను విద్యార్థులు తప్పుపడుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా విద్యార్థులపై నెపం నెట్టడాన్ని విద్యార్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

వీసీ వైఖరితోనే..!

శాతావాహన హాస్టల్‌లో ఉంటున్న బీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి మణికంఠ గురువారం ఆకస్మికంగా మరణించారు. ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురికాగా.. సరైన వైద్యం అందించకపోవడంతోనే తమ మిత్రుడు మరణించాడంటూ సహచర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. తమ ప్రాణాలకు విలువలేకుండా పోయిందని విద్యార్థులు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఏయూ ఆరోగ్య కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కనీసం ఆక్సిజన్‌ పెట్టేవారు కూడా లేరని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండే డాక్టర్‌ 24 గంటలు అందుబాటులో ఉండేందుకు వీలుగా క్వార్టర్‌ కేటాయించాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఒక క్వార్టర్‌లో రూ.లక్ష వెచ్చించి మరమ్మతులు జరిపితే అక్కడ నివసించేందుకు అనువుగా ఉంటుందని భావించి ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిని కనీసం వీసీ పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ ఫైలును కనీసం 6 సార్లు వీసీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే డాక్టరు అందుబాటులో లేకుండా పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ డాక్టరు అందుబాటులో ఉంటే... విద్యార్థి మణికంఠ ఏయూ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వెంటనే ఆక్సిజన్‌ అందించడంతో పాటు అంబులెన్స్‌లో జాగ్రత్తగా తరలించే వీలు కలిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సొంత భవంతికి లక్షలకు లక్షలు ఖర్చు చేసి సొబగులు అద్దుకుంటున్న వీసీ.. డాక్టర్‌ కోసం క్వార్టర్‌ మరమ్మతుకు రూ.లక్ష ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. మొత్తంగా వీసీ వ్యవహార శైలితో ఇప్పటికే ఏయూ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఏకంగా విద్యార్థుల ప్రాణాలకు కూడా సమస్యగా మారిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

డాక్టర్‌ అందుబాటులో లేకపోవడానికి ఇదే కారణం

ఫైల్‌ను ఆరు సార్లు పంపినా పట్టించుకోని ఏయూ వీసీ

విద్యార్థి మరణం నేపథ్యంలో వీసీ వైఖరిపై విమర్శల వెల్లువ

వరుసగా వివాదాలు..!

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏయూలో వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఒక ప్రైవేటు విద్యా సంస్థకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏయూలో నియమితులైన అధికారులందరూ సదరు ప్రైవేటు సంస్థలో గతంలో పనిచేయడమూ ఇందుకు కారణం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అన్నం సరిగ్గా లేదని ఒకసారి... కనీస సౌకర్యాలు లేవని మరోసారి.. నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఇంకోసారి ఇలా వరుస వివాదాల్లో కూరుకుపోతోంది. తాజాగా విద్యార్థి మరణించిన సంఘటనతో ఇన్నాళ్లుగా వ్యక్తమవుతున్న ఆందోళన కాస్తా.. ఆగ్రహంగా మారిపోయింది. ఏకంగా తమ ప్రాణాలనే బలితీసుకునేందుకూ వెనుకాడటం లేదన్న ఆవేశం విద్యార్థుల్లో కట్టలు తెంచుకుంది. వాస్తవానికి గతంలో కోవిడ్‌ సమయంలోనూ ఏయూలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించారు. ఏకంగా 600 మంది విద్యార్థులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు క్వారంటైన్‌ ముగిసిన తర్వాత వారి తల్లిదండ్రులకు జాగ్రత్తగా అప్పటి వీసీ ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో అప్పగించారు. అదేవిధంగా కోవిడ్‌ సమయంలో ప్రయాణానికి అనుమతి లేని 500 మంది విదేశీ విద్యార్థులకు టీకాలు లభించని సమయంలో కూడా టీకాలు వేయించి మరీ వారి ప్రాణాలకు భరోసా కల్పించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదని వచ్చిన విద్యార్థినికి సమయానికి ఆక్సిజన్‌ అందించి కాపాడుకోలేని ధీనస్థితికి ఏయూను పాలకులు దిగజార్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రూ.లక్ష లేదట1
1/1

రూ.లక్ష లేదట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement