
విశాఖ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు
విశాఖ సిటీ : విశాఖ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో వీఎంఆర్‌డీఏ, ఐజీబీసీ సంయుక్త సహకారంతో ‘పట్టణ ప్రణాళిక–భవిష్యత్తు నగరాలు’ అంశంపై శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ విశాఖలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపాదిత విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 2028–29 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నగర రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. రహదారి భద్రత, వేగవంతమైన ప్రయాణానికి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి రూ.200 కోట్ల అంచనా విలువతో ప్రతిపాదనలను ఏడీఎంకు సమర్పించామన్నారు. వీఎంఆర్‌డీఏ ద్వారా తీర ప్రాంత కోతను నివారించేందుకు ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధమవుతున్నట్లు వివరించారు. మధురవాడ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.550 కోట్ల భూగర్భ సొరంగం ప్రాజెక్టు ప్రతిపాదన దశలో ఉందన్నారు. నగరం నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న 41 కాలువలను మురుగునీటి శుద్ధి కర్మాగారాలకు అనుసంధానిస్తామన్నారు. వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ కె.రమేష్ మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి కేవలం 10 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఈ ఛాలెంజ్‌లను సమర్ధంగా ఎదుర్కొనడానికి వీఎంఆర్‌డీఏ థీమ్ ఆధారిత నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని వివరించారు. ఎస్‌బీఐ డీజీఎం రాహుల్ సాంకృత్య మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా ఎస్‌బీఐ గ్రీన్‌ఫైనాన్సింగ్, సోలార్‌ప్లాంట్లు, సూర్యశక్తి వంటి పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. సీఐఐ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కె.కుమార్‌రాజా మాట్లాడుతూ సంస్కృతి, వారసత్వ, వాతావరణానికి అనుగుణంగా పట్టణీకరణకు ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఐఐ ఏపీ మాజీ చైర్మన్ జి.ఎస్.శివకుమార్, సీఐఐ విశాఖ హెడ్ మౌళి, సీఐఐ ఐజీబీసీ వైస్ చైర్మన్ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.