
కన్న తండ్రిని రోడ్డుపై వదిలేసి..
అల్లిపురం: రోజురోజుకీ మానవత్వ విలువలు పడిపోతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. కన్న తల్లిదండ్రులను వారి అంతిమ దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు వారిని బరువుగా భావిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఆస్తులు కావాలి గానీ, కన్నవారు అవసరం లేదా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం విజయనగరం నుంచి సుమారు 75 ఏళ్ల వృద్ధుడిని రైల్వే స్టేషన్ దరి సిగ్నల్ పాయింట్‌కు సమీపంలో ఒక ఆటోలో తీసుకువచ్చి వదిలివెళ్లారు. ఆయనకు యూరినల్ బ్యాగు తగిలించి ఉండగా, డైపర్ వేసి ఉంది. వృద్ధుడి పరిస్థితిని చూసిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వెంటనే టూటౌన్ బ్లూకోల్ట్ కానిస్టేబుల్ నారాయణకు సమాచారం అందించారు. నారాయణ అక్కడికి వెళ్లి, ఆ వృద్ధుడి దుస్థితి చూసి చలించిపోయారు. అనంతరం రక్షక్‌కు ఫోన్ చేసి, విషయాన్ని టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడుకు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు వృద్ధుడిని భీమ్‌నగర్ నిరాశ్రయ వసతి గృహానికి తరలించి, ఆశ్రయం కల్పించారు. వృద్ధుడు తనది విజయనగరం అని మాత్రమే చెప్పగలుగుతున్నారని, ఇతర వివరాలు చెప్పలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి కౌన్సెలింగ్ చేసి, మరొకరు ఇలాంటి పనులు చేయకుండా తగిన విధంగా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు.