
ఎన్నికల హామీలను అమలు చేయాలి
అఖిల భారత న్యాయవాదుల సంఘం
విశాఖ లీగల్: ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అఖిల భారత న్యాయవాదుల సంఘ కార్యదర్శి, సినీయర్ న్యాయవాది నూకల వెంకటేశ్వరరావు శుక్రవారం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు నెరవేర్చాలంటూ సంఘం రాష్ట్రవ్యాప్తంగా సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 60 వేల మంది న్యాయవాదులు ఉన్నారని, వారిలో అధిక శాతం మంది గ్రామీణ నేపథ్యం కలిగిన వారేనన్నారు. కనీస వసతులు లేక వృత్తిలో నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యువ న్యాయవాదులకు రూ.5వేలు చొప్పున నెలసరి భృతి అందజేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తం కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. అలాగే నెలసరి భృతి రూ.10 వేలకు పెంచుతామన్న హామీ అమలుకు నోచు కోలేదని ఆరోపించారు. వివిధ కారణాలతో న్యాయవాదులు మరణిస్తే ఇచ్చే రూ.4 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ కూడా అమలు కాలేదన్నారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు.
పవన్ కల్యాణ్ హామీలకు కార్యరూపం ఎప్పుడు?
వారాహి యాత్ర సమయంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన అనేక హామీలు కూడా నేటికీ కార్యరూపం దాల్చలేదని న్యాయవాదులు గుర్తు చేశారు. న్యాయవాదులకు ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలు కావడం లేదన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలు, కోర్టుల నవీకరణ, ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గ్రంథాలయాలు తక్షణం అవసరమన్నారు. కార్యక్రమంలో ఏఐఎల్‌ఏ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది బి.వి.రామాంజనేయలు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.