
ప్రశాంతంగా దసరా వేడుకలు జరగాలి
విశాఖ సిటీ: నగరంలో ప్రశాంత వాతావరణంలో విజయ దశమి వేడుకలు జరిగేలా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో ఏడీసీపీల నుంచి ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో యాక్టివ్‌గా ఉన్న రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని చెప్పారు. నగరం నుంచి గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తిగా నివారించాలని, నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పికెట్, అవసరం మేరకు డికొయ్ టీంలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో క్రైమ్ రేటు తగ్గు ముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలన్నారు. సమావేశంలో డీసీపీ–2 డి.మేరీ ప్రశాంతి, డీసీపీ(క్రైమ్స్) లతా మాధురి, డీసీపీ(అడ్మిన్) కృష్ణ కాంత్ పటేల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.