
వెనక్కి!
తన పేరు చెప్పొద్దంటూ వేడుకోలు?
ఫిర్యాదుదారు బంధువు పోలీసు అధికారి ద్వారా రాయబారాలు!
రోజుకో మలుపు తిరుగుతున్న అనకాపల్లి స్టేషన్ ఎపిసోడ్
లోతుగా విచారణ చేపడుతున్న ఏసీబీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లోనే వసూళ్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ కేసులో నగదు తీసుకుంటూ ఎస్‌ఐ ఏసీబీకి చిక్కగా... స్టేషన్‌లో తీసుకున్న రూ.2 లక్షలు కాస్తా ఎవరి జేబులోకి వెళ్లాయనే కోణంలో ఏసీబీ విచారణ చేపట్టింది. ఇందుకోసం స్టేషన్ సీసీ ఫుటేజీని ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. అంతిమ లబ్ధిదారు ఎవరనే కోణంలో విచారణ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అయితే రూ.2 లక్షల వ్యవహారం బయటపొక్కకుండా ఉండేందుకుగానూ.. తన జేబులోకి వేసుకున్న వ్యక్తి కాస్తా తిరిగి ఫిర్యాదుదారుడికి వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా సదరు ఫిర్యాదుదారుడికి దూరపు బంధువైన ఓ పోలీసు అధికారి ద్వారా రాయబారం నడుపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. తనకు రూ.2 లక్షలు ఇచ్చినట్టు చెప్పవద్దంటూ బతిమలాడుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఏసీబీ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన ఎస్‌ఐ కాస్తా... తిరిగి త్వరలోనే తనకు లా అండ్ ఆర్డర్ పోస్టింగు వస్తుందంటూ ప్రచారం చేసుకుంటుండటం ఇప్పుడు అనకాపల్లిలో హాట్‌టాపిక్‌గా మారింది.
పేరు చెప్పొద్దు ప్లీజ్..!
వాస్తవానికి ఈ కేసు వ్యవహారంలో ఎంత మొత్తం తీసుకోవాలనే డైరెక్షన్ మొత్తం ఎస్‌ఐ వెనుక ఉండి ‘విజయ’వంతంగా నడిపించిన వ్యక్తి ఇప్పుడు తన పేరు బయటకు రాకుండా జాగ్రత్తలో పడినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఫిర్యాదుదారుడితో రాయబారాలు నడిపినట్టు కూడా సమాచారం. ఈ వ్యవహారంలో తనకు సహాయంగా ఉండేందుకు సదరు ఫిర్యాదుదారుడికి దూరపు బంధువైన ఓ సీఐ సహాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగానూ రూ.2 లక్షలు వెనక్కి ఇవ్వడంతో పాటు నమోదైన కేసు వ్యవహారంలోనూ సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో ఇప్పటికే రూ.2 లక్షలు అందజేసినట్టు స్పష్టంగా పేర్కొన్న ఫిర్యాదుదారుడు.. అంతిమంగా ఎవరికోసం ఇచ్చారనేది ఇప్పటివరకు వెల్లడించలేదని తెలుస్తోంది. ఇదే అదునుగా తన పేరు చెప్పకుండా ఉండాలంటూ తీసుకున్న రూ.2 లక్షలు తిరిగి వెనక్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా నగదు రూపంలో సదరు బంధువు ద్వారా లావాదేవీలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని కూడా ఏసీబీ లోతుగా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే బంధువని తెలిసినా..!
వాస్తవానికి బంగారం షాపు యజమాని స్థానిక ఎమ్మెల్యే బంధువు అని తెలుస్తోంది. తన షాపులోనికి రంధ్రం చేసుకుని వచ్చేందుకు ప్రయత్నించారని.. స్వయంగా సదరు బంధువు వెళ్లి కేసు నమోదు చేయాలంటూ కోరారు. అయితే దొంగతనం ఏమీ జరగలేదు కదా అంటూ.. వెంటనే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అల్లుడు కూడా ఫోన్ చేసి విచారణ చేయాలంటూ కోరినట్టు సమాచారం. అయినప్పటికీ అవతలి పార్టీ నుంచి లంచం తీసుకుని తాత్సారం చేసినట్టు తెలుస్తోంది.
ఒక ఎమ్మెల్యే బంధువు వ్యవహారంలోనే పోలీసులు ఇంత ఉదాసీనంగా కేసు పెట్టకుండా అవతలి వ్యక్తుల నుంచి పైసలు తీసుకున్నారంటే పోలీసింగ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఇరుక్కున్న ఎస్‌ఐ తనకు తిరిగి లా అండ్ ఆర్డర్‌లో పోస్టింగు వస్తుందంటూ.. ఇందుకోసం సిటీలోని ఓ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తనకు అండదండలందిస్తున్నట్టు కూడా ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం.