కేజీహెచ్‌లో సీబీఐ అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో సీబీఐ అధికారుల విచారణ

Sep 26 2025 6:04 AM | Updated on Sep 26 2025 6:04 AM

కేజీహెచ్‌లో సీబీఐ అధికారుల విచారణ

కేజీహెచ్‌లో సీబీఐ అధికారుల విచారణ

విద్యార్థిని రీతి సాహా మృతి కేసులో కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు ప్రారంభం

హాస్టల్‌ బిల్డింగ్‌ పైనుంచి పడి

మృతి చెందిన రీతి సాహా

ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్‌

దినేష్‌కుమార్‌ నేతృత్వంలో

నిపుణుల కమిటీతో భేటీ

మహారాణిపేట : విశాఖలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్‌ విద్యార్థిని రీతి సాహా కేసుపై సీబీఐ ఆరా తీస్తోంది. గురువారం సీబీఐ డీఎస్పీ దినేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లో విచారణ చేశారు. అనుమానాస్పద మృతి చెందడంతో అప్పట్లో నిపుణుల కమిటీ వేసి వారి చేత పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. అప్పుడు కమిటీ సభ్యులు డాక్టర్‌ మమత, డాక్టర్‌ హయగ్రీవరావు, డాక్టర్‌ సత్యప్రసాద్‌, డాక్టర్‌ వెంకటరమణ, డాక్టర్‌ రజనీకాంతరావులు పోస్టుమార్టం జరిపారు. ఇందులో ఇద్దరు వైద్యులు మమత, రజనీకాంతరావులకు ఇటీవల బదిలీ అయ్యింది. మిగిలిన ముగ్గురు వైద్యులను గురువారం దినేష్‌కుమార్‌ విచారించారు. రికార్డులను, అప్పటి పోస్టుమార్టమ్‌ నివేదికలను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థిని నీట్‌ శిక్షణ కోసం విశాఖలో ఆకాష్‌ బైజూస్‌ కాలేజ్‌లో చేరింది. 2023, జూలై 14న రాత్రి విశాఖ 4వ పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధి దొండపర్తిలో కాలేజీ నిర్వహిస్తున్న సాధన హాస్టల్‌ భవనం పైనుంచి పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 17న మృతి చెందింది. పోలీసులు తొలుత ఆమెది ఆత్మహత్యగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. హాస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని కాలేజీకి చెందిన ఇద్దరిని, హాస్టల్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే ఆమె మృతిపై తండ్రి సుఖ్‌దేవ్‌ సాహా మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తు తీరు సక్రమంగా లేదని, కాలేజీ యాజమాన్యంతో పోలీసులు కుమ్మకై ్కపోయారని ఆరోపణలు చేశారు. అలాగే సీసీ కెమెరా పరిశీలిస్తే.. తన కుమార్తె బిల్డింగ్‌పైకి వెళ్లినపుడు ఒక కలర్‌ డ్రెస్‌ ఉందని, కింద పడిన తర్వాత మరో కలర్‌ డ్రెస్‌ ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన సీబీఐ

అప్పట్లో విశాఖలో సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణ చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసు విషయంలో స్వయంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. దర్యాప్తు కోసం బెంగాల్‌ సీఐడీని విశాఖకు పంపించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో మరోసారి దర్యాప్తు జరుగుతోంది.

సిటీ పోలీసులకు తలనొప్పులు

విద్యార్థిని మృతి కేసు విశాఖ పోలీసుల పరువు తీసినట్టయింది. ముందు ఆమెది ఆత్మహత్యగానే పేర్కొంటూ స్వయంగా అప్పటి సీపీ త్రివిక్రమ్‌ వర్మ మీడియా సమావేశంలో తేల్చి చెప్పారు. బెంగాల్‌ నుంచి సీఐడీ దర్యాప్తు చేపట్టిన తర్వాత అప్పటి కప్పుడు సెక్షన్లు మార్చారు. దర్యాప్తు అధికారిని తప్పించి ఉన్నతాధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే సీఐ, ఎస్‌ఐలపై బదిలీ వేటు వేశారు. ఇపుడు మళ్లీ అప్పటి పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయన్న చర్చ పోలీస్‌ శాఖలోనే జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement