ఆక్సిజన్‌ పెట్టేవారే లేరు | - | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ పెట్టేవారే లేరు

Sep 26 2025 6:04 AM | Updated on Sep 26 2025 6:04 AM

ఆక్సి

ఆక్సిజన్‌ పెట్టేవారే లేరు

అందువల్లే బీఈడీ విద్యార్థి మృతి ?

ఏయూ ఆరోగ్య కేంద్రానికి సుస్తీ

వైద్యులు, సిబ్బంది లేక రోగుల అవస్థలు

నిత్యం 200 మంది రోగులకు

ఇద్దరే వైద్యులు

24 గంటల డిస్పెన్సరీకి ఇద్దరు నర్సులు,

ఇద్దరు ఫార్మసిస్టులు

విశాఖ సిటీ: శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రానికి సుస్తీ చేసింది. ఏటా వేలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న వర్సిటీ.. ఉద్యోగులు, విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తోంది. ఏయూ పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యం అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. ఒకవైపు వందేళ్ల సంబరాలు చేసుకుంటున్న ఏయూలో డిస్పెన్సరీ ‘ఊపిరి’ తీసేస్తున్నారు. నిత్యం వందల మంది వచ్చే ఏయూ ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలతో పాటు వైద్యులు, సిబ్బంది లేకపోవడం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సదుపాయం లేని కారణంగానే ఏయూలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మణికంఠ మరణించాడని విద్యార్థుల చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన ఏయూ పాలకుల నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది.

200 మంది రోగులు.. ఇద్దరే వైద్యులు

ఏయూలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర, ఇతర సిబ్బంది, విద్యార్థుల కోసం ఆరోగ్య కేంద్రం ఉంది. 24 గంటల పాటు ఇక్కడ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ ఉంటుంది. ఈ సమయంలో రోజుకు 200 మంది వరకు రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నది కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే. వీరిద్దరే చాలా ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు షిఫ్టులు వైద్య సేవలు అందించే ఈ ఆస్పత్రిలో కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. అలాగే ఫార్మసిస్టులు ముగ్గురికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాగే ఒక్కో షిఫ్ట్‌లో ఒక వార్డుబాయ్‌ ఉంటున్నారు. వీరే మొత్తం పనిచేయాల్సి వస్తోంది. ఎవరు సెలవు పెట్టినా మిగిలిన వారిపై పనిభారం పడుతోంది. ప్రధానంగా ఆక్సిజన్‌ సిలిండర్లు ఆస్పత్రిలో ఒకటి, అంబులెన్సులో ఒకటి ఉన్నాయి. కానీ అంబులెన్సులో రోగిని తీసుకెళ్లడానికి సిబ్బంది వెళ్లే పరిస్థితి లేదు. రోగికి ఆక్సిజన్‌ పెట్టేందుకు వార్డుబాయ్‌ వెళితే.. ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి ఎవరూ లేకుండా పోతున్నారు. ఇదే పరిస్థితి గురువారం ఎదురైంది. అస్వస్థతకు గురైన మణికంఠను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆక్సిజన్‌ పెట్టేందుకు సిబ్బంది లేరు. ఆక్సిజన్‌ పెట్టి ఉంటే మణికంఠ ప్రాణాలతో ఉండేవాడని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇలా ఆస్పత్రిలో అనేక సమస్యలు తిష్టవేసుకొని కూర్చున్నాయి. ఇక్కడి పరిస్థితులు, అసౌకర్యాలు, సిబ్బంది లోటు వంటి విషయాలను ఏయూ పాలకుల దృష్టికి పలువురు తీసుకువెళ్లినా ఇప్పటి వరకు వాటిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

జీతాలు అరకొరే..

ఆస్పత్రిలో సిబ్బంది జీతాల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దానికి పైగా పనిచేస్తున్న నర్సుకు ఇక్కడ కేవలం రూ.10 వేలు మాత్రమే ఇస్తుండడం గమనార్హం. అలాగే ఫార్మసిస్టులకు రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. జీతాలు పెంచాలని సిబ్బంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారిని పట్టించుకున్న వారే లేకుండా పోయారు. ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని, సిబ్బందిని నియమించాలని గత ఏడాది కాలంగా పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివాదాల్లో ఏయూ..

ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ను ఇటీవల కాలంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏయూ ప్రతిష్ట దిగజారుతోంది. నిత్యం ఏదో ఒక వివాదంతో ఆందోళనకు, నిరసనలకు కేంద్రంగా మారుతోంది. పాలనపై ఆరోపణలు, విద్యార్థుల వసతి సౌకర్యాలపై విమర్శలు.. పురుగుల భోజనాలతో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏయూలో పరిస్థితులపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏయూ వీసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతున్నారు. నిత్యం ఏదో ఒక రగడతో ఏయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతిసారి ఆందోళనల సమయాల్లో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని విద్యార్థులు మండిపడ్డారు.

ఆక్సిజన్‌ పెట్టేవారే లేరు1
1/2

ఆక్సిజన్‌ పెట్టేవారే లేరు

ఆక్సిజన్‌ పెట్టేవారే లేరు2
2/2

ఆక్సిజన్‌ పెట్టేవారే లేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement