అదృశ్యం కాదు.. హత్య! | - | Sakshi
Sakshi News home page

అదృశ్యం కాదు.. హత్య!

May 24 2025 1:01 AM | Updated on May 24 2025 1:01 AM

అదృశ్

అదృశ్యం కాదు.. హత్య!

అల్లిపురం: మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక మిస్సింగ్‌ కేసు మిస్టరీ వీడింది. దాదాపు మూడున్నరేళ్ల కిందట అదృశ్యమైన వివాహిత పల్లా గీత(45) హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అలుగు దివాకర్‌ను అరెస్ట్‌ చేశారు. మృతదేహాన్ని తరలించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మరో నిందితుడు వరప్రసాద్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో సీపీ ఈ వివరాలు వెల్లడించారు.

ఇదీ కేసు

మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న పల్లా గీత 2021 డిసెంబర్‌ 21న అదృశ్యమైనట్లు ఆమె కుమార్తె ఆబోతు సునీత 2022 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ‘వుమెన్‌ మిస్సింగ్‌’కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె ఆచూకీ లభించకపోవడంతో 2022 అక్టోబర్‌లో కేసును ‘అన్‌డిటెక్టెడ్‌’గా మూసివేశారు. తన తల్లి ఆచూకీ దాదాపు మూడున్నరేళ్లుగా తెలియకపోవడం.. తనకు న్యాయం జరగలేదని ఆవేదన చెందిన సునీత ఈ ఏడాది మే మొదటి వారంలో పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చిని కలిసి అభ్యర్థించారు. దీంతో కమిషనర్‌ ఆదేశాల మేరకు పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, కేసును పునఃవిచారణ చేపట్టారు.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలు

ప్రత్యేక బృందం పది రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించింది. పలు ప్రదేశాలను సందర్శించి, అనేక మంది సాక్షులను విచారించి, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, గీత హత్యకు గురైందని తేల్చారు. గీతతో సన్నిహితంగా ఉన్న అలుగు దివాకర్‌ ఆమెను పాశవికంగా హత్య చేసి.. ఏమీ తెలియనట్లు సమాజంలో తిరుగుతున్నాడని పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్‌ చేశారు.

ఘోరంగా హత్య.. మృతదేహం మాయం

2021 డిసెంబర్‌ 26న గీత మరోసారి ద్విచక్ర వాహనంపై దివాకర్‌ ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై గొడవపడింది. సాయంత్రం వరకు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దివాకర్‌ పెళ్లికి అంగీకరించకపోవడంతో గీత ప్రతిఘటించింది. ఈ ఘర్షణలో గీత గోళ్లతో రక్కడంతో దివాకర్‌ ముఖం, చేతులపై గాయాలయ్యాయి. దీంతో ఆమె తనను జీవితాంతం వేధిస్తుందని భావించిన దివాకర్‌.. ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. గీతను బలంగా గోడకు గుద్ది, ప్రాణం పోయే వరకు కొట్టి చంపాడు. అదే సమయానికి హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ స్నేహితుడు వరప్రసాద్‌ రావడంతో, అతని సహాయంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి, తన ఫోర్డ్‌ ఐకాన్‌ కారు వెనుక సీట్లో ఉంచాడు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం వద్ద పారుతున్న ఎర్ర కాలువలో అర్ధరాత్రి ఆ మృతదేహాన్ని పడేశారు.

నేరాన్ని కప్పిపుచ్చే యత్నం

హత్య అనంతరం దివాకర్‌ హైదరాబాద్‌ వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి, తర్వాత నగరానికి తిరిగి వచ్చాడు. గీత తన స్నేహితులతో కలిసి అదే రోజు తిరుపతి వెళ్లిందని ఒక కథ అల్లి.. బంధువులను, కుమార్తెను నమ్మించాడు. ఆమె సెల్‌ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి, చైన్నె తీసుకెళ్లి ఆన్‌ చేసి కాలువలో పడేశాడు. కొన్ని రోజుల తర్వాత గీత ద్విచక్ర వాహనాన్ని ఆమె కుమార్తెకు అప్పగించి, సహాయం చేస్తున్నట్లు ఎంతో తెలివిగా నటిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా సునీత ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ కేసులో దివాకర్‌ పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. గీత బైక్‌ను ఆమె కుమార్తెకు అప్పగించడం, తిరుపతి వెళ్లిందని నమ్మించడం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితుడిని విచారించారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో తగిన సాక్ష్యాధారాలతో అరెస్ట్‌ చేశారు. మృతదేహాన్ని రవాణా కొరకు ఉపయోగించిన ఫోర్డ్‌ ఐకాన్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. మూసివేసిన కేసును పది రోజుల్లోనే ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ హుస్సేన్‌ను పోలీస్‌ కమిషనర్‌ ప్రశంసాపత్రంతో సత్కరించారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన సీసీఎస్‌ ఏఎస్‌ఐ పి.చంద్రశేఖర్‌, మహారాణిపేట క్రైం కానిస్టేబుల్‌ ఎన్‌.ఎ.రాజు, టూటౌన్‌ కానిస్టేబుల్‌ ఎ.వినోద్‌, త్రీటౌన్‌ కానిస్టేబుల్‌ వి.రామరాజులను సీపీ అభినందించారు.

వివాహిత మిస్సింగ్‌ కేసు మిస్టరీ వీడింది

మూడున్నరేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘోరం

కుమార్తె పోరాటంతో కదిలిన డొంక

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దివాకర్‌ అరెస్ట్‌

హత్యకు దారితీసిన పరిస్థితులివీ..

భర్తతో విబేధాల కారణంగా పిల్లలను అతని వద్దే విడిచిపెట్టి.. మెలోడీ థియేటర్‌ ఎదురుగా తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఫ్లాట్‌లో గీత ఒంటరిగా నివసిస్తూ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేసేది. ఫ్లాట్‌ నిర్మాణ సమయంలో బిల్డర్‌తో వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో దివాకర్‌ సహాయం చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కృతజ్ఞతతో గీత తన ప్లాట్‌లోని ఒక గదిని దివాకర్‌కు రియల్‌ ఎస్టేట్‌ ఆఫీస్‌ కోసం ఇచ్చింది. ఆమె దివాకర్‌ను నమ్మి అతను చెప్పిన కొంత మందికి లక్షల్లో అప్పు ఇచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో పెళ్లి చేసుకోవాలని దివాకర్‌ను గీత ఒత్తిడి చేయడం ప్రారంభించింది. అయితే దివాకర్‌కు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో క్రమంగా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇది గ్రహించిన గీత బుచ్చిరాజుపాలెంలో నివసిస్తున్న దివాకర్‌ ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. 2021 నవంబర్‌ 20న అతని ఇంటికి వెళ్లి.. అతని ఆఫీస్‌ సిబ్బంది ముందే పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. దీంతో దివాకర్‌ తన సిబ్బందితో కలిసి ఇంటికి తాళం వేయకుండానే అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు.

అదృశ్యం కాదు.. హత్య! 1
1/2

అదృశ్యం కాదు.. హత్య!

అదృశ్యం కాదు.. హత్య! 2
2/2

అదృశ్యం కాదు.. హత్య!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement