
విశాఖలో టూరిజం సర్క్యూట్
విశాఖ సిటీ: విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం సర్క్యూట్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవా రం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధు లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. జీవీఎంసీ వాటర్ పైప్‌లైన్ పనులు పూర్తి చేయాలని, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, పుష్ కార్ట్‌లు లేకపోవడంతో పారిశుధ్య పనులకు ఇబ్బందులు, 2014లో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం డీడీలు కట్టించుకున్న వారికి ఇళ్ల స్థలాల మంజూరు, సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు విశాఖపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కోస్టల్ కారిడార్ నుంచి భీమిలి వరకు బీచ్ కారిడార్ అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వీకేపీసీపీఐఆర్, మాస్టర్‌ప్లాన్–2041, ఎంఐజీ లేఅవుట్లు, ప్రతిపాదిత లేఅవుట్లు, మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణాలు, తీర ప్రాంత కోత ప్రాజెక్టు, కై లాసగిరి, రుషికొండ సమగ్రాభివృద్ధి, భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు, సింహాచలం స్థలాలకు సంబంధించిన సమస్యలు, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి నెలా సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై సమీక్షిస్తామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సంపత్ కుమార్, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, అంబేడ్కర్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై
మంత్రి నారాయణ సమీక్ష
అమరావతిపైనే కాదు.. విశాఖపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేల విజ్ఞప్తి