
ఉపాధ్యాయుల బదిలీలు షురూ
విశాఖ విద్య: విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. బుధవారం నుంచి బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో, ఇందుకనుగుణంగా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు. గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులు 93 ఖాళీగా ఉన్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. క్లియర్ వేకెన్సీ 46 పోస్టులు ఉండగా, రేషనలైజేషన్‌లో భాగంగా 24 పోస్టులు ఖాళీ చూపించారు. ఫారిన్ సర్వీసుపై వెళ్లిన వారి ఖాళీలు రెండు ఉన్నాయి. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. కంపల్సరీ ట్రాన్స్‌ఫర్ అయ్యే జాబితాలో 15 మంది లెక్క తేలారు. వీరు గురువారం సాయంత్రం 5 గంటల్లోగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలి. కంపల్సరీ ట్రాన్స్‌ఫర్ జాబితాలో ఉన్న వారెవరైనా బదిలీ చేయనట్లయితే, వారికి చివరిగా మిగిలిన ఖాళీల్లో పోస్టింగ్ కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా, బాలికల పాఠశాలలో 50 ఏళ్ల లోపు ఉన్న వారిని కూడా బదిలీ చేస్తున్నారు. ఇలా ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు గుర్తించి, వారి జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వీరు కూడా తప్పనిసరిగా బదిలీ కోసమని దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఈవో వెల్లడించారు. విశాఖలోని సీతమ్మధారలోని ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లలో పనిచేస్తున్న అన్ని క్యాడర్‌ల వారీగా ఖాళీల జాబితాలను సిద్ధం చేస్తున్నామన్నారు.
తొలుత గ్రేడ్–2 హెచ్‌ఎంలకు బదిలీ
ఉమ్మడి విశాఖ జిల్లాలో 93 ఖాళీలు
మొదలైన దరఖాస్తుల ప్రక్రియ
బాలికల పాఠశాలల్లో మహిళా
ఉపాధ్యాయులకే చోటు
ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్‌లో హెల్ప్ డెస్క్