
ఖైదీల సమస్యలు తెలుసుకున్న డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు సందర్శించారు. జైలు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. సన్యాసినాయుడు ఖైదీలు ఉండే బ్యారక్‌లు, పరిసరాలను పరిశీలించి, వారికి కల్పించిన సౌకర్యాలు, వైద్యం, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు సమావేశ మందిరంలో ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఏ కేసుల్లో జైలుకు వచ్చారు, ఎప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నారు అనే వివరాలను తెలుసుకొని, వారికి అవసరమైన న్యాయ సహాయం గురించి వివరించారు. ఖైదీలు మంచి నడవడికతో ఉండాలని, విడుదలయ్యాక బాహ్య ప్రపంచంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్ బాబు, ఉప పర్యవేక్షణాధికారులు ఎన్.సాయిప్రవీణ్, సీహెచ్.సూర్యకుమార్, జైలర్లు, డీఎల్‌ఎస్‌ఏసిబ్బంది పాల్గొన్నారు.