
ఐసెట్‌లో మెరిసిన మనోళ్లు
● విశాఖ జిల్లాకే నంబర్‌వన్ ర్యాంక్ ● టాప్‌టెన్‌లో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చోటు ● రాష్ట్రంలో విశాఖ నుంచే అత్యధిక మంది హాజరు
విశాఖ విద్య: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ పరీక్ష ఐసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది మొత్తం 32,719 మంది ఐసెట్‌లో ఉత్తీర్ణత సాధించగా, విశాఖ జిల్లాకు చెందిన మేక మనోజ్ రాష్ట్రంలోనే నంబర్ వన్ ర్యాంకు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేశాడు.
టాప్–10లో ముగ్గురు విశాఖ వాసులే..
టాప్–10 ర్యాంకుల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. అనకాపల్లి జిల్లాకు చెందిన షేక్ బషీరున్నీషా 6వ ర్యాంకు సాధించగా, పెదగంట్యాడ మండలంలోని శరగడ గణేష్ రెడ్డి 9వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
అధిక సంఖ్యలో బాలికల ఉత్తీర్ణత
ఐసెట్ పరీక్షకు అనకాపల్లి జిల్లా నుంచి 169 మంది హాజరుకాగా, వారిలో 167 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో 120 మంది బాలికలు ఉన్నారు. అదే విధంగా, విశాఖపట్నం జిల్లా నుంచి 4,397 మంది పరీక్ష రాయగా, వీరిలో 4,303 మంది క్వాలిఫై అయ్యారు. విశేషమేమిటంటే, ఉత్తీర్ణులైన వారిలో 2,377 మంది బాలికలు ఉండటం గమనార్హం. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పట్ల బాలికలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని దీని ద్వారా తెలుస్తోంది.
అత్యధిక హాజరు విశాఖ నుంచే
రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఐసెట్‌కు హాజరైన విద్యార్థుల్లో విశాఖ నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరుకావడం మరో విశేషం. ఇది జిల్లాలో విద్యాభ్యాసం పట్ల ఉన్న ఆసక్తిని, ఉన్నత విద్యపై విద్యార్థులకున్న ఆకాంక్షను స్పష్టం చేస్తోంది.
శభాష్ గణేష్‌రెడ్డి
పెదగంట్యాడ: ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ ఐసెట్–2025 ఫలితాల్లో మండలంలోని పెదకోరాడ గ్రామానికి చెందిన విద్యార్థి శరగడ గణేష్‌రెడ్డి 9వర్యాంకు సాధించి సత్తాచాటాడు. పెదకోరాడకు చెందిన శరగడ ఎల్లయ్యరెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్‌రెడ్డి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా గణేష్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ రంగంలో స్థిరపడతానని తన లక్ష్యాన్ని వెల్లడించాడు. అతని ప్రతిభకు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.