
రాదండి!
ఇంటింటికీ
రేషన్ బండి..
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు భారాలు, కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు అన్నింటిపైనా భారం మోపుతూ.. మరోవైపు ఉన్న సౌకర్యాలను దూరం చేస్తోంది. తాజాగా ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో నెలా నెలా ఠంచనుగా ఇంటి వద్దకే వచ్చే రేషన్(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్–ఎండీయూ) బండికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడరాదన్న ఆశయంతో గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి స్వస్తి పలికింది. ఇప్పటికే కార్డుదారులకు అరకొర సరుకులను అందిస్తున్న ప్రభుత్వం.. జూన్ 1 నుంచి ఎండీయూ వాహనాలతో రేషన్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఎండీయూ ఆపరేటర్లు భగ్గుమంటున్నారు.
ప్రజల ఇబ్బందులు తీర్చాలనే..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాక ముందు రేషన్ సరకులు తీసుకోవడం ఓ ప్రహసనం. రోజంతా పనులు మానుకుని మరీ రేషన్ డీపోల దగ్గర పడిగాపులు కాసేవారు. బియ్యానికి ఒక రోజు, పంచదారకు ఓ రోజు.. ఇలా ఒక్కో సరకుకు ఒక్కో రోజున వెళ్లాల్సి వచ్చేది. చాంతాడంత లైన్లలో గంటల తరబడి నిరీక్షించేవారు. ఇక సర్వర్లు మొరాయిస్తే ఉస్సూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిందే. ఈ కష్టాలను తెలుసుకున్న గత సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జనవరి 2021లో ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి నుంచి ఇంటి ముందుకే వ్యాన్ల ద్వారా సరకులు అందించడం మొదలెట్టారు. దీంతో రేషన్ కోసం తిప్పలు పడాల్సిన పని తప్పింది.
ఆరేళ్లకు అగ్రిమెంట్
నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎండీయూ వాహనాలను బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించి, ఆరేళ్ల(72 నెలలు)కు అగ్రిమెంటు చేశారు. జనవరి 2027 వరకు ఆ గడువు ఉంది. అప్పటికి వాహనాల బ్యాంకు రుణాలు కూడా దాదాపు ముగిసి, వాహనం నిరుద్యోగ యువత సొంతమవుతుంది. అయితే 20 నెలల ముందుగానే దీనికి ముగింపు పలకడంతో ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డున పడ్డ సిబ్బంది
ఈ పథకం ద్వారా జిల్లాలో 351 మంది ప్రత్యక్షంగా, మరికొంత మంది పరోక్షంగా బతుకున్నారు. నెలకు కుటుంబానికి సరిపడా వచ్చే సొమ్ముతో ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు అర్ధంతరంగా ఈ పథకానికి మంగళం పలకడంతో ఆపరేటర్లు, ఇతర సిబ్బంది రోడ్డున పడ్డారు. దశల వారీ ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దీనిపై రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళికను రూపొందించనున్నారు.
కష్టం తెలియకుండా ఇంటి వద్దే రేషన్ తీసుకోవడం ఇక గత చరిత్రే. టీడీపీ ప్రభుత్వ నిత్యకృత్యాలైన నిత్యావసరాల కోసం కిలోమీటర్ల మేర కాలినడక, నెత్తిన బరువుల మోత, గంటల తరబడి నిరీక్షణ మళ్లీ ప్రజలు అనుభవించాల్సిందే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల సౌకర్యార్థం అమల్లోకి తెచ్చిన ఒక్కో పథకాన్ని నీరుగార్చే ప్రక్రియలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. తాజా నిర్ణయంతో జిల్లాలోని 351 ఎండీయూ వాహనాల డీలర్లు, సహాయకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఎండీయూ వాహనాలకు మంగళం
జిల్లాలో 351 ఎండీయూ వాహనాలు
రోడ్డున పడ్డ 702 కుటుంబాలు
జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారానే సరకులు
ఎండీయూ వాహనాలు 351
ఆధారపడ్డ సిబ్బంది 702
జిల్లాలో
వివరాలు
తెలుపు రేషన్ కార్డులు 5,12,619
చౌక ధరల డిపోలు 625
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఈ వాహనాల మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఎండీయూ ఆపరేటర్లకు న్యాయం చేయాలి. వీటిపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఆకస్మాత్తుగా నిలుపుదల చేయడంతో రోడ్డున పడ్డాం. ఈ వయస్సులో ఎక్కడకై నా వెళ్లి పనిచేయలేం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. మాలాంటి చిన్నస్థాయి బతుకులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదు.
– నీరు కొండ సతీష్, ఎండీయూ ఆపరేటర్
అగ్రిమెంట్ గడువు ఇంకా ఉంది
2027 జనవరి వరకు అగ్రిమెంటు ఉంది. ఇంతలోనే తొలగించడం అన్యాయం. ఒక వేళ తొలగిస్తే రానున్న 20 నెలల జీతాలు చెల్లించాలి. కరోనా సమయంలో ఎండీయూ డీలర్లు ఎన్నో సేవలు అందించారు. వైరస్‌కు భయపడకుండా పనిచేశారు. రాజకీయ కారణాలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మేమంతా రోడ్డున పడతాం. మా కుటుంబాలకు అన్యాయం చేయొద్దు. – ఎన్.సతీష్ కుమార్, అధ్యక్షుడు,
ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్

రాదండి!

రాదండి!