
‘అమృత్ భారత్’ పనులు వేగవంతం
అధికారులకు వాల్తేర్ డీఆర్‌ఎం ఆదేశం
అగనంపూడి: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో అమృత భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా, సీనియర్ డీసీఎం సందీప్‌లతో కూడిన బృందం పరిశీలించింది. ముందుగా డీఆర్‌ఎం ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వైపు నిర్మిస్తున్న ప్రధాన పరిపాలన భవన నిర్మాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఒకటి, నాలుగు ప్లాట్‌ఫాంలను కలుపుతూ నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి, వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్లాట్‌ఫాం నంబర్ నాలుగు వైపు జరుగుతున్న సుందరీకరణ, రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం అధికారులతో మాట్లాడుతూ నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తూర్పు కోస్తా రైల్వే జోనల్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డీఆర్‌ఎంను కలిసి ఇక్కడి సమస్యలపై వినతపత్రం సమర్పించారు. విశాఖ–తిరుపతి డబుల్ డెక్కర్ రైలులో శాశ్వత ప్రాతిపదికన థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని, కోచ్‌లకు నీటి సరఫరా సౌకర్యం కల్పించి సిబ్బందిని నియమించాలని, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లను ఏర్పాటు చేయాలని వారు కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జాషువా, కామేశ్వరరావు ఉన్నారు.