
చందనోత్సవం ఘటనకు మంత్రుల కమిటీదే బాధ్యత
సింహాచలం: చందనోత్సవం రోజున సింహాచలం కొండపై ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనకు కూటమి ప్రభుత్వ మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని మాజీ దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏర్పాట్లపై మైక్రో లెవెల్‌లో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పుకున్న మంత్రులు, భక్తుల మృతికి కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రెండు చందనోత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని, 1.60 లక్షల మంది భక్తులకు నిజరూప దర్శనం కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదని, పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అమరావతి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, తమ వారికి లాభాలు చేకూర్చే విధంగానే కూటమి ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు.