
గళమెత్తిన కలం
● సాక్షి ఎడిటర్ ఇంట్లో దాడులపై జర్నలిస్టు సంఘాల నిరసన ● కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ప్రదర్శన ● కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన జర్నలిస్టు నేతలు
మహారాణిపేట : ఎలాంటి అనుమతులు, సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా ప్రవేశించి సోదాలు చేయడంపై పలు జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తెస్తుండడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు జర్నలిస్టు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కలెక్టర్‌కు వినతి పత్రం
సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేయడాన్ని నిరసిస్తూ పలు జర్నలిస్టు సంఘాల నేతలు గురువారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్, బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర నాయకుడు ఆర్.రామచంద్రరావు తదితరులు ఉన్నారు.
నిరసన ప్రదర్శన
అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన జర్నలిస్టు సంఘాల నేతలు కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జర్నలిస్టులపై దాడులను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాక్షి విశాఖ బ్యూరో ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈ రోజును పత్రికా రంగంలో బ్లాక్ డేగా పరిగణిస్తున్నామన్నారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల డెస్క్ ఇన్‌చార్జి బి.బి.సాగర్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు సరికావని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ పక్కి వేణుగోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్న సాక్షిపై కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని పేర్కొన్నారు. విశాఖ ఎడిషన్ ఇన్‌చార్జి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గళమెత్తిన కలం