
రక్తదానం చేసి స్ఫూర్తి నింపిన కలెక్టర్
మహారాణిపేట: జిల్లా యంత్రాంగం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని కలెక్టరేట్ పరిధిలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో, జిల్లా పరిషత్ కూడలిలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ రక్తదానం ఆవశ్యకతను తెలుపుతూ పిలుపునివ్వడంతో, జిల్లాలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. కలెక్టరేట్ శిబిరంలో 143 మంది, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఆరుగురు మొత్తం 149 మంది దాతలు రక్తదానం చేశారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్‌తో కలిసి రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తినిచ్చారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు, ఆది లీల ఫౌండేషన్, కలెక్టరేట్ అధికారులతో కలిసి కలెక్టర్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రవికుమార్, పీఆర్వో రావు, ఆది లీల ఫౌండేషన్ ప్రతినిధి ఆదినారాయణ రాజు, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ఇతర అధికారులు, ఉద్యోగులు, వైద్యాధికారులు, వలంటీర్లు పాల్గొన్నారు.