
ఓషన్ వ్యూ.. ఓ జ్ఞాపకం
భీమునిపట్నం: భీమిలిలో ఓషన్ వ్యూ బంగ్లాగా పేరుగాంచిన చారిత్రాత్మక భవనం నేలమట్టం కావడంతో, ఈ అరుదైన కట్టడాన్ని చూసే అవకాశం ఎవరికీ లేదు. బ్రిటిష్ పాలనలో భీమిలి కొండవాలు ప్రాంతంలో రోడ్డు పక్కన ఇంపీరియల్ బ్యాంకుగా ఇది నిర్మితమైంది. అప్పట్లో ఇక్కడ పోర్టు ఉండడం వల్ల వాణిజ్య లావాదేవీల కోసం ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు. అందుకే ఈ ప్రాంతానికి బ్యాంక్ రోడ్డు అనే పేరు వచ్చింది. స్వాతంత్య్రం అనంతరం, చిట్టివలస జూట్‌మిల్లు యాజమాన్యం ఈ భవనాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి విశాలమైన బంగ్లాగా మార్చింది. ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో ఇక్కడి నుంచి సముద్ర దృశ్యం అద్భుతంగా కనిపించేది. దీంతో ఈ బంగ్లాకు ‘ఓషన్ వ్యూ బంగ్లా’ అనే పేరు స్థిరపడింది. ఇది జూట్‌మిల్లు గెస్ట్‌హౌస్‌గా ఉపయోగపడేది. జూట్‌మిల్లు యజమానులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రముఖులు భీమిలి వచ్చినప్పుడు ఇక్కడే బస చేసేవారు. జూట్‌మిల్లు మూతపడటంతో ఈ బంగ్లా కూడా గత 15 ఏళ్లుగా మూతబడి ఉంది. అయినప్పటికీ ప్రత్యేకమైన నిర్మాణ శైలి కారణంగా చాలా మంది దానిని చూసి ఆనందించేవారు. కొన్నేళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తులు దీనిని కొనుగోలు చేయగా, ప్రస్తుతం వారు దానిని కూల్చివేశారు. ఇప్పటికే ఎన్నో అరుదైన చారిత్రక కట్టడాలు కనుమరుగవగా, ఇప్పుడు ఈ ‘ఓషన్ వ్యూ బంగ్లా’ కూడా చరిత్రలో కలిసిపోయింది.

ఓషన్ వ్యూ.. ఓ జ్ఞాపకం