పాల ఎల్లమ్మ బిడ్డను.. ప్రజల కష్టాలు తెలుసు | - | Sakshi
Sakshi News home page

పాల ఎల్లమ్మ బిడ్డను.. ప్రజల కష్టాలు తెలుసు

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

మరో రూ.4,500 కోట్లతో యాక్షన్‌ ప్లాన్‌ నేను మంత్రిగా ఉన్న సమయంలోనే నియోజకవర్గం పురోగతి మళ్లీ ఇప్పుడుపరుగులు పెట్టిస్తున్నాం మంత్రి పదవి వస్తే మరింత అభివృద్ధి చేస్తా ‘సాక్షి’తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌: ‘ఎమ్మెల్యేగా నా సొంత నియోజకవర్గం వికారాబాద్‌ అభివృద్ధి.. సభాపతిగా అసెంబ్లీ నిర్వహణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నా.. గడిచిన పదేళ్లలో సభాపతి అర్థమే మార్చేశారు.. ఇప్పుడు దాన్ని మళ్లీ గాడిలో పెట్టాం.. ప్రతి సభ్యుడికి మాట్లాడేందుకు అవకాశం కల్పించడం ద్వారా సమవర్తిగా వ్యవహరించా.. అదే సమయంలో నన్ను నమ్మి ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజల నమ్మకం వమ్ము చేయకుండా గడిచిన రెండున్నరేళ్లలో అభివృద్ధి దిశగా నడిపించగలిగా’నని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. స్పీకర్‌గా రెండున్నర వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన చెపుకొచ్చిన పలు అంశాలు ఇలా..

రూ.3,500 కోట్లతో అభివృద్ధి

నేను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభి వృద్ధే నేటికీ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో శిలాఫలకాలు వేయడం తప్ప ఒక్క పని కూడా చేసింది లేదు. వారు మంజూరు చేశామని చెప్పుకుంటున్న మెడికల్‌ కళాశాల, ఆయుష్‌ ఆస్పత్రి, జనరల్‌ ఆస్పత్రి, రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి తదితర పనులన్నీ నేను ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌ బాధ్యతలు చేపట్టాకే ప్రారంభించాం.నేడు పనులన్నీ చివరి దశలో ఉన్నాయి. నియోజకవర్గంలో రూ.3,500 కోట్లతో పనులు చేపడుతున్నాం. రూ.670 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. మరో రూ.200 కోట్లతో పంచాయతీరాజ్‌ రోడ్ల పనులు జరుగుతున్నాయి. హ్యామ్‌ పథకం కింద మరో రూ.300 కోట్ల పంచాయతీరాజ్‌ నిధులు తీసుకువచ్చాం. రూ.1,200 కోట్లతో అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మెఘా సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ – మన్నెగూడ హైవే పనులు చివరి దశలో ఉన్నాయి. రూ.100 కోట్లతో వికారాబాద్‌ రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, రూ.100 కోట్లతో వికారాబాద్‌ – పరిగి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నాం. కొడంగల్‌ నుంచి నాగారం మీదుగా ధారూరు వరకు రూ.200 కోట్లతో ఫోర్‌వే నిర్మిస్తున్నాం. రూ.200 కోట్లతో మెడికల్‌ కళాశాల, రూ.50 కోట్లతో మర్పల్లిలో ప్లిక్‌ స్కూల్‌, రూ.97 కోట్లతో కోట్‌పల్లి ఆధునీకరణ, రూ.50 కోట్లతో వికారాబాద్‌ – తాండూరు రోడ్డు, రూ.5 కోట్లతో సర్పన్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధి, వికారాబాద్‌లో ఐదుచోట్ల 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.

రూ.4,500 కోట్లతో ప్రణాళికలు

మరో రూ.4,500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని స్పీకర్‌ తెలిపా రు. అనంతగిరి, రామయ్యగూడ, గేట్‌వనంపల్లి వద్ద రైల్వే అండర్‌ పాస్‌లు మంజూరయ్యాయి. హైదరాబాద్‌ నుంచి ప్రగతి రిసార్ట్స్‌, చిలుకూరు బాలాజీ టెంపుల్‌, సిద్దులూరు మీదుగా వికారాబాద్‌ వరకు నాలుగు లేన్లుగా, తాండూరు – బార్వాద్‌, కోట్‌పల్లి, మోమోన్‌పేట మీదుగా సదాశివపేట వరకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మర్పల్లి నుంచి మోమిన్‌పేట, మైతాప్‌ఖాన్‌గూడ నుంచి శంకర్‌పల్లి వరకు, తాండూరు నుంచి వికారాబాద్‌ మీదుగా మన్నెగూడ వరకు గల రోడ్డును ఫోర్‌ లేనుగా విస్తరణకు ప్రతిపాదనలు పంపించాం. జిల్లా కేంద్రం చుట్టూ రూ.900 కోట్లతో రింగురోడ్డుకు ప్రతిపాదనలు పంపాం. వికారాబాద్‌లో స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.

అనుభవం ఉంది

మంత్రి పదవిపై మొదటి సారి స్పందించారు. గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అధిష్టానం, సీఎం సూచనల మేరకు స్పీకర్‌ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. మంత్రిగా అవకాశం ఇస్తే వికారాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తా. నామినేటెడ్‌ పోస్టుల విషయంలో కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. పని చేసే వారికే పదవులు ఇస్తున్నాం. ఎల్‌నినో ప్రభావంతో పంటలు దెబ్బతిన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. నష్టపరిహారం అందలా చూస్తా. సొంతంగా ట్రస్టు ఏర్పాటు చేసి ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నాం.

స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చా

స్పీకర్‌గా ఉంటూ రాజకీయాలు చేస్తున్నారంటూ కొందరు నాపై చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. స్పీకర్‌ కంటే ముందు నా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేను. నన్ను గెలిపించిన ప్రజలకు ఏం చేయాలో అది చేస్తున్నా. అది రాజకీయం అనుకుంటే వారి అవివేకమే. సభాపతిగా సమర్థవంతంగా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌ అంటే ఎంతో హుందాగా ఉండేవారు.. గత పదేళ్లలో ఏం జరిగిందో.. నేను బాధ్యతలు స్వీకరించాక వివక్షకు తావు లేకుండా ప్రతి సభ్యుడికి మైక్‌ ఇచ్చి మాట్లాడించా. పాలమ్ముకునే పాల ఎల్లమ్మ కడుపున పుట్టిన నేను బాధలు, సంతోషం.. ఎత్తుపల్లాలు చూశా. వేటికి వెరవకుండా ఎంపీపీగా.. ఎమ్మెల్యేగా, మంత్రిగా, నేడు స్పీకర్‌ వరకు ఎదిగా. ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

రూ.3,500 కోట్లతో వికారాబాద్‌ అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement