ఇక డ్రోన్‌ పిచికారీ | - | Sakshi
Sakshi News home page

ఇక డ్రోన్‌ పిచికారీ

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

జిల్లాలో అనుమతి పొందినవి డ్రోన్లు 30 గంటకు 10 ఎకరాల వరకు స్ప్రే ఎకరాకు రూ.450 వసూలు పట్టణ ప్రాంతాల్లో ర్యాపిడో తరహాలో సేవలు నేడు మొబైల్‌ యాప్‌నుప్రారంభించనున్న వ్యవసాయ శాఖ

తాండూరు: పంటలకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తున్నాయా..? చీడపీడల మందు పిచికారీ చేసేందుకు కూలీలు దొరకడం లేదా..? ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రైతులకు సమయం, శ్రమ, పెట్టుబడి ఖర్చులు తగ్గించే దశగా ముందడుగు పడుతోంది. ఇందులో భాగంగా రైతులను స్థానిక డ్రోన్‌ పైలెట్లతో నేరుగా అనుసంధానించి పంట పొలాల్లో పురుగు మందుల పిచికారీ సేవలను సులభంగా పొందేందుకు రూపొందించిన మొబైల్‌ యాప్‌ను నేడు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.

కూలీలు దొరకక..

జిల్లా వాసులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధా రం. అధిక సంఖ్యలో సాగుపైనే ఆధారపడి జీవించే కుటుంబాలు ఉన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో 6లక్షల ఎకరాలు, రబీ సీజన్‌లో 2లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలను పండిస్తారు. ప్రధానంగా పత్తి, కంది, వరి అధికంగా సాగు చేస్తున్నారు. పంటల సస్యరక్షణ చర్యలకు కొన్నేళ్లుగా కూలీలు దొరకక సరైన సమయానికి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పంటలను చీడపీడలు ఆశించి నష్ట పరుస్తున్నాయి.ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డ్రోన్ల ద్వారా పంటలను పిచికారీ చేసేందుకు అధికారిక అనుమతులు అందించింది.

ఓలా.. ర్యాపిడో తరహాలో..

పట్టణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వాహనాన్ని ఓలా, ఊబర్‌ యాప్‌లలో బుక్‌ చేసుకున్న వెంటనే నిమిషాల వ్యవధిలో వాహనం ముందు ఉంటుంది. ఆ తరహాలోనే జిల్లా లోని రైతులు పండిస్తున్న పంటల సమస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు మొబైల్‌ యాప్‌లో రైతులు బుక్‌ చేసుకున్న వెంటనే డ్రోన్‌ పైలెట్‌ అందుబాటులోకి రానున్నారు. ఈ యాప్‌ ద్వారా రైతులు తమ కు అవసరమైన సమయంలో స్థానిక డ్రోన్‌ పైలెట్ల ను సంప్రదించి పంట పొలాల్లో పిచికారీ సేవలను పొందవచ్చు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. కూలీల కొరత ఉన్న సమయంలోనూ ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా మారనుంది. పంట పొలాల్లోకి వెళ్లి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం తగ్గడంతో రైతులు నేరుగా పురుగు మందులకు గురయ్య ప్రమాదాన్ని కూడా కొంత వరకు తగ్గించుకోవచ్చు. డ్రోన్‌ సాంకేతికత ద్వారా పంటలపై మందులను సమర్థవంతంగా పిచికారీ చేయడంతో పాటు నీరు, సమయం, శ్రమ వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే పంట రకం, పొలం, విస్తీర్ణం ఉపయోగించే మందులు, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వ్యవసా య నిపుణుల సూచనల మేరకు పిచికారీ చేపట్టడం అవసరం. డ్రోన్‌ సేవలు వినియోగంతో రైతులకు సాగు పనులు మరింత సులభతరం కానున్నాయి.

బుక్‌ చేసిన వెంటనేరైతుల వద్ద పైలెట్‌

జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఐలా అగ్రి డ్రోన్‌ సంస్థ ద్వారా డ్రోన్‌ యాప్‌ మొబైల్‌ సేవలు నేడు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 30 డ్రోన్లు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. డ్రోన్‌ పైలెట్లుగా అనుమతులు ఉన్న నిష్టాతులతో మందు పిచికారీ చేస్తున్నారు. పైలెట్‌కు ఎకరాకు రూ.450 చార్జిని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న 30 మంది పైలెట్లను ఈ మొబైల్‌ యాప్‌లో అనుసంధానం చేయనున్నారు. నేడు మొబైల్‌ యాప్‌ను ప్రారంభించేందుకు వికారాబాద్‌ జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు సమక్షంలో ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు.

ఎకరాకు రూ.450 చార్జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement