సర్కారీ బడులకు కార్పొరేట్‌ కళ! | - | Sakshi
Sakshi News home page

సర్కారీ బడులకు కార్పొరేట్‌ కళ!

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

జిల్లాలో ఎనిమిది పాఠశాలలకు టీపీఎస్‌ హోదా కేటాయింపుల్లో కొడంగల్‌కు పెద్దపీట రూ.92.30 కోట్లతోఅధునాతన వసతులు కొత్తగా మరో మూడింటికి అనుమతులు నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకే చోట విద్య గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన చదువులు

బషీరాబాద్‌: పేదింటి బిడ్డకు కార్పొరేట్‌ స్థాయి చదువు అందితే.. ఉన్నత విద్యకు పునాది పడినట్లే! ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు వేర్వేరు బడుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒకే ప్రాంగణంలో అన్ని తరగతులు చదివే అవకాశం కల్పించడమే తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల లక్ష్యం. ప్రభుత్వ బడుల్లో ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్‌ బోధన, రవాణా సదుపాయాలు కల్పించి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయాలని సర్కారు భావిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ప్రైవేటు విద్య ఖర్చుల భారం తగ్గించడంతోపాటు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి పోటీ ప్రపంచానికి సిద్ధం చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ క్రమంలో జిల్లాలో ఎనిమిది పాఠశాలలకు రూ.92.30 కోట్ల నిధులు కేటాయించగా.. తాజాగా మరో మూడు బడులకు రూ.33 కోట్ల పరిపాలనా అనుమతులు లభించాయి.

మూడు స్కూళ్లకు రూ.33 కోట్లు

పాఠశాల విద్యాశాఖ ఈ నెల 9న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హస్నాబాద్‌ పాఠశాలకు రూ.12 కోట్లు, బషీరాబాద్‌ ఉన్నత బాలుర పాఠశాలకు రూ.11 కోట్లు, పరిగి పాఠశాలకు రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నారు.

కొడంగల్‌కు పెద్దపీట

జిల్లాలో కొడంగల్‌ నియోజవర్గంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. జిల్లాలో 8 ప్రభుత్వ పాఠశాలలకు టీపీఎస్‌ హోదా కల్పిస్తే అందులో ఆరు కొడంగల్‌ నియోజకవర్గానికే దక్కాయి. గతంలో ఎంపికై న దౌల్తాబాద్‌, కొడంగల్‌ బాలుర, బాలికల పాఠశాలలు, బొంరాస్‌పేట, హకీంపేట పాఠశాలలకు రూ.59.30 కోట్లు కేటాయించారు. తాజాగా జెడ్పీహెచ్‌ఎస్‌ హస్నాబాద్‌కు టీపీఎస్‌ హోదా కల్పిస్తూ రూ.12 కోట్లు మంజూరు చేసింది. అలాగే తాండూరు, పరిగి నియోజకవర్గాలకు చెరొక పాఠశాల దక్కింది. ఎనిమిది పాఠశాలలకు కలిపి రూ.92.30 కోట్లు నిధులు కేటాయించింది.

ఒకే చోట అన్ని తరగతులు

ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించనున్నారు. ఇంగ్లిష్‌ మాధ్యమ బోధనతోపాటు డిజిటల్‌ తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. రవాణా కోసం ఒక్కో పాఠశాలకు పది వరకు బస్సులు కేటాయించే ప్రతిపాదన ఉంది. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాలు, రాగి జావ వంటి సదుపాయాలు కల్పించనున్నారు. మెరుగైన బోధన, ప్రయోగాత్మక అభ్యాసం, రవాణా సౌకర్యాలతో గ్రామీణ విద్యార్థులకు సమాన విద్యావకాశాలు లభించనున్నాయి. పథకం పూర్తిస్థాయిలో అమలైతే ప్రభుత్వ బడులపై తల్లిదండ్రుల నమ్మకం పెరగడంతోపాటు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే అవసరం తగ్గే అవకాశం ఉంది.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు

గ్రామీణ పేద విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్‌స్థాయిలో విద్యను అందించేందుకు చేపట్టిన చర్యలు ఎంతో ప్రయోజనం చూకేరుతుందని బషీరాబాద్‌ సొసైటీ చైర్‌పర్సన్‌ కరుణ, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ శంకరప్ప వేరువేరు ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం వలనే విద్యాశాఖలలో ఇలాంటి సంస్కరణలు వచ్చాయన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వారు కృతజతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement